▪️ పాశం యాదగిరి ఆధ్వర్యంలో కార్యక్రమం
హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో ప్రముఖ భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు సంగోలి రాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులు, వివిధ బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. సంగోలి రాయన్న పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ఆయన చరిత్రను తెలిపారు. కర్ణాటకకు చెందిన సంగోలి రాయన్న 1798 ఆగస్టు 15న బెలగావి జిల్లాలోని సంగోళి గ్రామంలో జన్మించారు. కిత్తూరు రాణి చెన్నమ్మ సైన్యంలో సీనియర్ కమాండర్‌గా పనిచేసిన ఆయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు. రాణి చెన్నమ్మను బ్రిటిష్ అధికారులు అరెస్టు చేసిన అనంతరం కూడా రాయన్న తన పోరాటాన్ని కొనసాగించారు. గెరిల్లా పద్ధతుల్లో బ్రిటిష్ పరిపాలనా భవనాలు, ఖజానాలపై దాడులు చేస్తూ వారికి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. రైతులను సమీకరించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారు. బ్రిటిష్ అధికారులు 1830 ఏప్రిల్‌లో సంగోలి రాయన్నను అరెస్టు చేశారు. అనంతరం 1831 జనవరి 26న నందగడ వద్ద మర్రిచెట్టుకు ఉరితీశారు. ఆయన త్యాగం, వీరత్వం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని వక్తలు పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ అశోక్ దయ్యాల, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి స్వామి ముద్దం, వీ5 అధినేత కడకంచి వెంకటేశ్, షానీకే విశ్వనాధ్ కురుమ, అవుకు సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నాడి రమేష్ కురుమ, ఒగ్గు పర్వతాలు కురుమ, కురుమ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు గణం నర్సింహ కురుమ, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి దయ్యాల శ్రీనివాస్,బీసీ సంఘం నాయకులు అది నారాయణ, అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు పోగుల సహదేవ్, గురునాథ్, నరేష్, గోరంట్ల సత్యం, శివాజీ, రాజు తదితరులు పాల్గొన్నారు.

