• నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డా. జేఎం వ్యాస్‌ చేతుల మీదుగా సత్కారం
  • ‘ఏఐ ఇన్‌ మోడ్రన్‌ జర్నలిజం’ పుస్తకంపై ప్రశంసలు..
  • ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో మెటావర్స్‌ అధ్యాయం బోధన

హైదరాబాద్‌ / గాంధీనగర్‌ (గుజరాత్‌):
‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌ మోడ్రన్‌ జర్నలిజం’ పుస్తక రచయిత, సీనియర్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌, జర్నలిస్ట్‌, సాంకేతిక జర్నలిజం నిపుణుడు ముద్దం నరసింహస్వామికి గుజరాత్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ)లో అరుదైన‌ గౌరవం లభించింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ వ్యవస్థాపక వైస్‌ ఛాన్సలర్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. జేఎం వ్యాస్‌ ముద్దం నరసింహస్వామిని అభినందించి, శాలువాతో సత్కరించారు.

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) హైదరాబాద్‌ ఆధ్వర్యంలో గుజరాత్‌ పర్యటనకు వెళ్లిన తెలంగాణ జర్నలిస్టుల బృందం గాంధీనగర్‌లోని ఎన్‌ఎఫ్‌ఎస్‌యూను సందర్శించింది. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్సలర్‌ డా. జేఎం వ్యాస్‌ జర్నలిస్టుల బృందంతో సమావేశమయ్యారు. ముద్దం నరసింహస్వామి రచించిన ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌ మోడ్రన్‌ జర్నలిజం’ పుస్తకాన్ని పరిశీలించిన ఆయన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ, డిజిటల్‌ టెక్నాలజీలను జర్నలిజంతో అనుసంధానిస్తూ పుస్తకాన్ని రూపొందించిన తీరును ప్రశంసించారు.

ప్రత్యేకంగా పుస్తకంలోని ‘మెటావర్స్‌’ అధ్యాయాన్ని ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో బోధిస్తున్నట్లు డా. జేఎం వ్యాస్‌ వెల్లడించారు. జర్నలిజం రంగంలో కృత్రిమ మేధ, మెటావర్స్‌, డిజిటల్‌ సాంకేతికతల వినియోగం, వాటి ప్రభావం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై రూపొందుతున్న పుస్తకాలు జర్నలిస్టులు, మీడియా విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.

ఈ సందర్భంగా ముద్దం నరసింహస్వామిని డా. జేఎం వ్యాస్‌ శాలువాతో సత్కరించి అభినందించారు. ఏఐ ఆధారిత జర్నలిజం, కొత్తతరం డిజిటల్‌ మీడియా, మెటావర్స్‌ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశాలను జర్నలిజంతో అనుసంధానిస్తూ చేస్తున్న రచనా కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పీఐబీ ఐఐఎస్‌ అధికారిణి వర్గంటి గాయత్రితో పాటు గుజరాత్‌ పర్యటనలో పాల్గొన్న తెలంగాణ జర్నలిస్టుల బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఫోరెన్సిక్‌ విద్య, పరిశోధనపై అవగాహన

తెలంగాణ జర్నలిస్టుల బృందానికి ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ విద్య, పరిశోధన, శిక్షణ కార్యక్రమాలపై డా. జేఎం వ్యాస్‌ వివరించారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌, బిహేవియరల్‌ సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఇన్వెస్టిగేషన్‌ తదితర విభాగాల్లో విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు.

అనంతరం జర్నలిస్టుల బృందం ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలోని ఆధునిక ప్రయోగశాలలను సందర్శించింది. సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌, ఆధునిక ఫోరెన్సిక్‌ మౌలిక వసతులను పరిశీలించి, అక్కడ అందిస్తున్న విద్య, శిక్షణ, పరిశోధన కార్యక్రమాలపై అవగాహన పొందింది.