▪️ పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
▪️ నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీకి ప్రకటన
▪️ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్: పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు అటవీ శాఖలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న యర్కల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఈ లక్ష్య సాధన కోసం తన ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
ఉద్యోగాల భర్తీకి సమగ్ర ప్రణాళిక
ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి సమగ్ర ఉద్యోగ క్యాలెండర్ రూపొందించడం, నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల ప్రక్రియను పారదర్శకంగా, నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా కృషి చేయడం తన ప్రాధాన్యతలని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువత కోసం గ్రంథాలయాలు, అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు కెరీర్ మార్గదర్శకత్వం, డిజిటల్ వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
డిగ్రీ పూర్తిచేసిన యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించాలని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రైవేటు రంగంలోనూ స్థానిక పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సేవా సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సీపీఎస్ రద్దు, ప్రమోషన్లు, బదిలీలు, పెండింగ్ బకాయిలు వంటి అంశాలపై ఉద్యోగుల తరఫున కృషి చేస్తానని తెలిపారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇస్తానన్నారు.
విద్య, మహిళా సాధికారతకు ప్రాధాన్యం
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలను అభివృద్ధి చేయడంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను సకాలంలో విడుదల చేసే అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక సమాచార, శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.
మహిళా పట్టభద్రులకు భద్రత, స్వయం ఉపాధి, కెరీర్లో తిరిగి కొనసాగేందుకు అవసరమైన అవకాశాలు కల్పించడం, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం తన కార్యాచరణలో భాగమని తెలిపారు. గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
పట్టభద్రులకు అందుబాటులో ఉండే నాయకత్వం
నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులు తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ప్రత్యేక సంప్రదింపుల వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేయాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తన కార్యాచరణకు పట్టభద్రులు మద్దతుగా నిలిచి, ఎమ్మెల్సీగా సేవలందించే అవకాశం కల్పించాలని యర్కల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
