6 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ.. వందలాది మంది తెలుగు ప్రజల సందడి
సియాటిల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని విదేశీ గడ్డపై చాటిచెబుతూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) సియాటిల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వందలాది మంది ప్రవాస తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని, సంప్రదాయ పాటలు, కోలాటాలు, ప్రత్యేక కార్యక్రమాలతో సందడి చేశారు.
వేడుకల్లో ఆరు అడుగుల ఎత్తులో తాజా రంగురంగుల పూలతో కళాత్మకంగా పేర్చిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలు రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మను చూసేందుకు పాల్గొన్నవారు ఆసక్తి చూపారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారి ప్రతిమ వేడుకలకు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అమ్మవారి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
అనంతరం చిన్నారులు, యువతీ యువకులు, మహిళలు ప్రదర్శించిన కోలాటాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ వస్త్రధారణలో, రంగురంగుల పట్టుచీరల్లో తరలివచ్చిన మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలు అక్కడి తెలుగు కుటుంబాల్లో ఆనందోత్సాహాలను నింపాయి.

ఉత్తమ బతుకమ్మ పోటీలు ప్రత్యేక ఆకర్షణ
వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉత్తమ బతుకమ్మ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు తమ సృజనాత్మకతను, కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వివిధ రకాల పూలతో అందమైన బతుకమ్మలను రూపొందించారు. ఒక్కో బతుకమ్మ ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకోవడంతో విజేతల ఎంపిక ఆసక్తికరంగా సాగింది.

ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో టీడీఎఫ్ సియాటిల్ బృందం, వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. టీడీఎఫ్ సియాటిల్ ముఖ్య సభ్యులు విక్రమ్ గార్లపాటి, రాహుల్ సూర్యోదయ్, అర్చనా నామిలకొండ కార్యక్రమ నిర్వహణలో విశేష కృషి చేశారు. అర్చనా నామిలకొండ ప్రస్తుతం టీడీఎఫ్ ఉపాధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రవాస తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, వారిలో సాంస్కృతిక అనుబంధాన్ని, ఐక్యతను బలోపేతం చేసేలా ఈ వేడుకలు సాగాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనడంతో సియాటిల్‌లో నిర్వహించిన టీడీఎఫ్ బతుకమ్మ సంబరాలు ప్రవాస తెలంగాణ ప్రజలకు మధుర జ్ఞాపకంగా నిలిచాయి.
https://drive.google.com/drive/folders/110UpFHYTl1SkfwSZ9VEIxWho5XCSPPCA


