• ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
  • వన్‌వే విధానంతో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం.. రూ.1,090 కోట్ల స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల పనులు రద్దు
  • పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు 4 కి.మీ. ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌

హైదరాబాద్‌: భాగ్యనగరం నడిబొడ్డున ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేబీఆర్‌ పార్కు చుట్టూ స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రాజెక్టుకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ నిర్వహణలో భాగంగా అమలు చేసిన వన్‌వే విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో.. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా చేపట్టిన కేబీఆర్‌ ప్రాజెక్టును రద్దు చేయాలని నిర్ణయించింది. దీనికి బదులుగా పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

కేబీఆర్‌ పార్కు చుట్టూ జూబ్లీ చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు గేట్, ముగ్దా జంక్షన్, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి తదితర ఏడు కీలక కూడళ్ల వద్ద స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌లు నిర్మించేందుకు గతంలో ప్రణాళిక రూపొందించారు. మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను రెండు ప్యాకేజీలుగా చేపట్టేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇందుకోసం కేఎన్‌ఆర్‌, మేఘా సంస్థలతో కాంట్రాక్టు ఒప్పందాలు కూడా కుదిరాయి.

అయితే, నిర్మాణ పనులు ప్రారంభిస్తే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యామ్నాయంగా నెల రోజుల క్రితం ఆయా మార్గాల్లో వన్‌వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తొలిరోజుల్లో ఒకట్రెండు రోజులపాటు వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితి క్రమంగా చక్కబడింది. సిగ్నళ్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వాహనాలు సాఫీగా కదలడం ప్రారంభించాయి.

దీంతో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ సమస్యను వన్‌వే విధానంతోనే గణనీయంగా పరిష్కరించగలిగినప్పుడు.. వందల కోట్ల రూపాయలు వెచ్చించి భారీ నిర్మాణాలు చేపట్టడం అవసరమా? అన్న అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేసింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను సులభతరం చేయడంతోపాటు భారీ వ్యయాన్ని తగ్గించే దిశగా కేబీఆర్‌ ప్రాజెక్టును రద్దు చేయాలని నిర్ణయించింది.

స్థాయీ సంఘం ఆమోదం
కేబీఆర్‌ ప్రాజెక్టు రద్దుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం రూపొందించిన తీర్మానాన్ని శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఆమోదించారు. ప్రత్యేక అధికారి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ప్రతిపాదించిన స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల పనులను రద్దు చేయడంతోపాటు.. ఆయా పనుల కోసం కేఎన్‌ఆర్‌, మేఘా సంస్థలతో కుదుర్చుకున్న కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసేందుకు కూడా స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది.


పంజాగుట్ట–జూబ్లీ చెక్‌పోస్టు మధ్య కొత్త మార్గం
కేబీఆర్‌ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు సిగ్నల్‌ రహిత రాకపోకలకు వీలు కల్పించే ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని నిర్ణయించారు. పంజాగుట్టలోని ఎన్‌ఎఫ్‌సీఎల్‌ కూడలి నుంచి జూబ్లీ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ రోడ్డును, అంటే జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 36ను, అనుసంధానిస్తూ ఈ కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నారు.
ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్‌ సుమారు 4 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. దీంతో పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనాలకు మార్గమధ్యలోని ట్రాఫిక్‌ సిగ్నళ్లతో సంబంధం లేకుండా వేగంగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది.

ముఫకంజా వద్ద ఎక్కితే.. మెట్రో స్టేషన్‌ కిందకు
బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 3లోని ముఫకంజా విద్యాసంస్థల వద్ద ఎలివేటెడ్‌ కారిడార్‌పైకి వాహనాలు ఎక్కేలా ర్యాంప్‌ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ కిందకు చేరుకునేలా కారిడార్‌ను డిజైన్‌ చేయనున్నారు. అదేవిధంగా జూబ్లీ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ వద్ద కారిడార్‌పైకి ఎక్కే వాహనాలు.. తిరిగి ముఫకంజా కాలేజీ వద్ద దిగేలా మార్గాన్ని రూపొందించనున్నారు.

రోడ్డు నంబర్‌ 1 వైపు వెళ్లేవారికి ప్రత్యేక ర్యాంప్‌
బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 1 వైపు వెళ్లే వాహనాలకు కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం ఎలివేటెడ్‌ కారిడార్‌ నుంచి జలగం వెంగళరావు పార్కు వరకు ప్రత్యేక ర్యాంప్‌ నిర్మించనున్నారు. దీనివల్ల కారిడార్‌పై ప్రయాణించే వాహనాలు అవసరమైన చోట దిగిపోయి ఆయా ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది.

మేఘాకు బాధ్యతలు
కేబీఆర్‌ పార్కు చుట్టూ చేపట్టాలనుకున్న పాత ప్రాజెక్టును రద్దు చేసిన నేపథ్యంలో.. ప్రత్యామ్నాయంగా చేపట్టనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టు బాధ్యతలను జీహెచ్‌ఎంసీ మేఘా సంస్థకు అప్పగించింది. అయితే కారిడార్‌కు సంబంధించిన పూర్తి డిజైన్లు సిద్ధమైన తర్వాతే మొత్తం అంచనా వ్యయం, నిర్మాణానికి అవసరమైన ఇతర అంశాలు, సాంకేతిక వివరాలపై స్పష్టత రానుంది.


కేబీఆర్‌ పార్కు చుట్టూ ఏడు కూడళ్ల వద్ద భారీ నిర్మాణాలకు బదులుగా.. ఒకే ఎలివేటెడ్‌ కారిడార్‌తో పంజాగుట్ట–జూబ్లీ చెక్‌పోస్టు మార్గంలో ట్రాఫిక్‌ను సిగ్నల్‌ రహితంగా మార్చడం ద్వారా నగర రవాణాకు మెరుగైన పరిష్కారం చూపాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.