- సబర్మతి మల్టీమోడల్ హబ్.. భవిష్యత్ రవాణాకు కొత్త చిరునామా
- సబర్మతి.. నాలుగు రవాణా మార్గాలకు కూడలి
- బుల్లెట్ రైలు నుంచి మెట్రో, రైల్వే, BRTS వరకు.. ఒకే చోట అనుసంధానం
- గుజరాత్‌లో వేగంగా సాగుతున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు
–జర్నలిస్టు స్వామి ముద్దం (గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక కథనం)
దేశంలో తొలి బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు గుజరాత్‌లో ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైస్పీడ్ రైల్ మార్గంతో పాటు స్టేషన్లను కూడా అత్యాధునిక సాంకేతికత, ప్రయాణికుల సౌకర్యాలు, స్థానిక సంస్కృతి, చారిత్రక వారసత్వం కలగలిసేలా తీర్చిదిద్దుతున్నారు.
ఈ ప్రాజెక్టులో కీలకమైన సబర్మతి, అహ్మదాబాద్ స్టేషన్ల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా సబర్మతి హైస్పీడ్ రైల్ మల్టీమోడల్ హబ్ ఒకే సముదాయంలో పలు రవాణా వ్యవస్థలను అనుసంధానిస్తూ దేశంలో సమగ్ర ప్రజా రవాణాకు కొత్త నమూనాను ఆవిష్కరిస్తోంది.
508 కిలోమీటర్లు.. 2 గంటల 7 నిమిషాలు
ముంబై–అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. ఈ మార్గంలో బుల్లెట్ రైలు అత్యధికంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ముంబై–అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.1.08 లక్షల కోట్లు. హైస్పీడ్ రైల్ మార్గంలో మొత్తం 12 స్టేషన్లను నిర్మిస్తున్నారు. బుల్లెట్ రైలు వ్యవస్థతో పాటు సాధారణ రైల్వే, మెట్రో, బస్సు వంటి ప్రజా రవాణా వ్యవస్థలతో అనుసంధానం కల్పించేలా స్టేషన్లను రూపొందిస్తున్నారు.
NHSRCL అహ్మదాబాద్ సివిల్ పనుల విభాగం ప్రిన్సిపల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రాజేష్ అగర్వాల్ వివరాల ప్రకారం, గుజరాత్‌లోని సూరత్–బిలిమోరా మధ్య సుమారు 50 కిలోమీటర్ల మేర 2027 ఆగస్టులో ట్రయల్ రన్ చేపట్టే ప్రణాళిక ఉంది.
సబర్మతి.. నాలుగు రవాణా మార్గాలకు కూడలి
సబర్మతి మల్టీమోడల్ హబ్ ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణాల్లో ఒకటి. బుల్లెట్ రైలు, భారతీయ రైల్వేలు, అహ్మదాబాద్ మెట్రో, బీఆర్‌టీఎస్, స్థానిక రోడ్డు రవాణా వ్యవస్థల మధ్య ప్రయాణికులు సులభంగా మారేలా ఈ హబ్‌ను రూపొందించారు.
సబర్మతి బ్రాడ్‌గేజ్, మీటర్‌గేజ్ రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్, నిర్మాణంలో ఉన్న హైస్పీడ్ రైల్ స్టేషన్, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థలను అనుసంధానించేలా దీనిని డిజైన్ చేశారు.
ఒక రవాణా వ్యవస్థ నుంచి మరోదానికి మారేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ట్రావెలేటర్లు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. దీంతో ప్రయాణికులు స్టేషన్ బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వివిధ రవాణా మార్గాలకు మారే అవకాశం ఉంటుంది.
45 వేల చదరపు మీటర్లలో అత్యాధునిక హబ్
సుమారు 45,094 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణంలో సబర్మతి హైస్పీడ్ రైల్ టెర్మినల్‌ను రూపొందిస్తున్నారు. హబ్‌లో ఆధునిక వెయిటింగ్ లాంజ్‌లు, టికెట్ సదుపాయాలు, రిటైల్ దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయ ప్రాంతాలు తదితర వసతులు ఉంటాయి.
హబ్‌లోని ప్రధాన భవన నిర్మాణం దాదాపుగా పూర్తయింది. భవనంలోని వివిధ విభాగాల్లో ప్రయాణికుల సౌకర్యాలతో పాటు వాణిజ్య, అతిథి సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్, కాన్ఫరెన్స్ హాళ్లు, బ్యాంకెట్ హాళ్లు, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.
దండియాత్రకు అద్దం పట్టే ముఖభాగం
సబర్మతి ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని హబ్ నిర్మాణానికి ప్రత్యేక రూపకల్పన చేశారు.
మహాత్మాగాంధీ నేతృత్వంలో సాగిన చారిత్రక దండి మార్చ్‌ను ప్రతిబింబించే భారీ స్టెయిన్‌లెస్ స్టీల్ మ్యూరల్ హబ్ ముఖభాగంలో ఏర్పాటు చేశారు. ఆధునిక రవాణా సాంకేతికతతో పాటు సబర్మతి చరిత్ర, గుజరాత్ వారసత్వాన్ని ప్రతిబింబించేలా భవనానికి రూపకల్పన చేయడం ప్రత్యేకత.
చరఖా స్ఫూర్తితో సబర్మతి బుల్లెట్ రైల్ స్టేషన్
సబర్మతి హైస్పీడ్ రైల్ టెర్మినల్ రూపకల్పనకు మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమంలోని చరఖా స్ఫూర్తిగా నిలిచింది. సుమారు 45 వేల చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణంతో, భూమి నుంచి సుమారు 44 మీటర్ల ఎత్తులో స్టేషన్ భవనం ఉంటుంది.
స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆధునిక సాంకేతికత, ప్రయాణికుల సౌకర్యాలతో పాటు సబర్మతి ఆశ్రమం, గాంధీజీ చరిత్రను గుర్తు చేసేలా నిర్మాణ శైలిని రూపొందిస్తున్నారు.
అహ్మదాబాద్ స్టేషన్.. నగర వారసత్వానికి ప్రతిరూపం
అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ స్టేషన్‌ను నగర సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు. సుమారు 38,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, భూమి నుంచి సుమారు 33.7 మీటర్ల ఎత్తులో స్టేషన్ నిర్మాణం ఉంటుంది.
ప్రయాణికుల కోసం లాంజ్‌లు, మరుగుదొడ్లు, ఉద్యానవనాలు, వాణిజ్య దుకాణాలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. బుల్లెట్ రైల్ స్టేషన్‌ను మెట్రో, బస్సు, క్యాబ్ సర్వీసులతో అనుసంధానించేందుకు ఇంటిగ్రేటెడ్ భవనాన్ని నిర్మిస్తున్నారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌తోనూ అనుసంధానం కల్పిస్తున్నారు.
అహ్మదాబాద్ విమానాశ్రయం స్టేషన్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో, గీతా మందిర్ సెంట్రల్ బస్ స్టాండ్ సుమారు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
పర్యావరణహిత హబ్
సబర్మతి మల్టీమోడల్ హబ్ నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాన్ని చేపడుతున్నారు.
రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల ద్వారా హరిత విద్యుత్ ఉత్పత్తి, సహజ వెలుతురు అందేలా గ్లాస్ ఫెసాడ్, వర్షపు నీటి సంరక్షణ, ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. స్టెప్ గార్డెన్లు వంటి పచ్చదనం ఆధారిత నిర్మాణ అంశాలను కూడా పొందుపరిచారు. ప్రాజెక్టుకు ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ లభించినట్లు అధికారులు తెలిపారు.
1,200కుపైగా వాహనాలకు పార్కింగ్
ప్రయాణికుల వాహనాల కోసం మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 1,200కుపైగా వాహనాలు నిలిపే సామర్థ్యంతో పార్కింగ్ ప్రాంతాలను రూపొందించారు. ప్రత్యేక పిక్‌అప్, డ్రాప్‌ఆఫ్ జోన్‌లు కూడా ఉన్నాయి.
ఒకే చోట.. అనేక ప్రయాణ మార్గాలు
సబర్మతి మల్టీమోడల్ హబ్ ప్రత్యేకత కేవలం బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకురావడంలోనే లేదు. భవిష్యత్ నగరాల్లో ప్రజా రవాణా ఎలా ఉండాలనే దానికి ఒక సమగ్ర నమూనాను ఇది చూపిస్తోంది.
బుల్లెట్ రైలు నుంచి సాధారణ రైల్వేకు.. రైల్వే నుంచి మెట్రోకు.. మెట్రో నుంచి బీఆర్‌టీఎస్‌కు.. ఇలా ఒకే సముదాయంలో పలు రవాణా మార్గాలను అనుసంధానించడం ద్వారా ప్రయాణికుల రవాణా అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి హబ్‌ను రూపొందిస్తున్నారు.
సబర్మతి హబ్ నిర్మాణం, అహ్మదాబాద్, సబర్మతి హైస్పీడ్ రైల్ స్టేషన్ల పురోగతి, బుల్లెట్ రైల్ ప్రాజెక్టు భవిష్యత్ ప్రణాళికలను తెలంగాణ జర్నలిస్టుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. NHSRCL డీజీఎం (సివిల్) ఆదిత్య సింగ్, పీఆర్‌ఓ అరుణ్ బరోట్ తదితర అధికారులు ప్రాజెక్టు వివరాలను బృందానికి వెల్లడించారు.

హైదరాబాద్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో గుజరాత్‌లో పర్యటిస్తున్న తెలంగాణ జర్నలిస్టుల బృందం సబర్మతి హైస్పీడ్ రైల్ మల్టీమోడల్ హబ్, అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ స్టేషన్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పీఐబీ IIS అధికారి వర్గంటి గాయత్రి నేతృత్వంలో జరిగిన ఈ పర్యటనలో NHSRCL అధికారులు ప్రాజెక్టు నిర్మాణం, సాంకేతిక అంశాలు, ప్రయాణికుల సౌకర్యాలు, రవాణా అనుసంధానం తదితర వివరాలను జర్నలిస్టులకు వివరించారు.
