• ‘డెయిరీ టు ది వరల్డ్’గా అమూల్ విస్తరణ
  • రైతు సంక్షేమమే లక్ష్యం.. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులే ధ్యేయం
  • చిత్తూరులో రూ.250 కోట్లతో అత్యాధునిక ఆటోమేటెడ్ ఐస్‌క్రీమ్ ప్లాంట్

ఆనంద్, గుజరాత్ నుంచి – స్వామి ముద్దం ప్రత్యేక కథనం

గుజరాత్‌లోని ఆనంద్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది అమూల్. భారతదేశ శ్వేత విప్లవానికి పుట్టినిల్లుగా చెప్పుకునే ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు.. ఒక డెయిరీ సంస్థ ఎంత పెద్ద సహకార ఉద్యమంగా మారగలదో ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

ఆనంద్‌లోని అమూల్ డెయిరీని సందర్శించినప్పుడు, పాల సేకరణ నుంచి ప్రాసెసింగ్, నాణ్యత నియంత్రణ, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వరకు సాగుతున్న ఒక సమగ్ర వ్యవస్థ కనిపించింది. మార్కెట్‌లో మనం చూస్తున్న అమూల్ ఉత్పత్తుల వెనుక వేలాది గ్రామాలు, లక్షలాది పాడి రైతులు, సహకార సంఘాలు, ఆధునిక సాంకేతికత కలిసి పనిచేస్తున్నాయి.

ఒకప్పుడు గ్రామీణ రైతు తన వద్ద ఉన్న పాలను స్థానిక మార్కెట్‌లో విక్రయించుకోవడమే ప్రధాన మార్గం. కానీ అమూల్ సహకార నమూనా ఆ పరిస్థితిని మార్చింది. రైతే వ్యవస్థలో కేంద్రబిందువుగా మారాడు. అతని నుంచి పాలను సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి, వివిధ ఉత్పత్తులుగా మార్చి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ మార్కెట్లలోకి తీసుకెళ్లే స్థాయికి ఈ వ్యవస్థ ఎదిగింది.

ఆనంద్‌లోని అమూల్ డెయిరీని సందర్శించిన సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అమిత్ వ్యాస్ సంస్థ కార్యకలాపాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, దేశవ్యాప్త విస్తరణ, సాంకేతికత వినియోగం, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

‘డెయిరీ టు ది వరల్డ్’

‘‘మేము ఇప్పుడు ‘డెయిరీ టు ది వరల్డ్’గా ఎదిగాం’’ అని డాక్టర్ అమిత్ వ్యాస్ పేర్కొన్నారు. ప్రారంభ దశలో సహకార సంస్థల నమూనా విజయవంతం అవుతుందా అనే సందేహాలు ఉన్నప్పటికీ, రైతులు, వినియోగదారులు, ప్రభుత్వం నుంచి లభించిన మద్దతుతో అమూల్ బలమైన వ్యవస్థగా ఎదిగిందన్నారు.

వినియోగదారులు అమూల్ ఉత్పత్తులపై చూపుతున్న విశ్వాసం, ఆదరణే సంస్థకు అతిపెద్ద బలమని చెప్పారు. అందుకే అమూల్ ‘ది టేస్ట్ ఆఫ్ ఇండియా’గా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుందని వివరించారు.

రైతే యజమాని.. రైతే కేంద్రబిందువు

అమూల్ సహకార వ్యవస్థకు రైతు సంక్షేమమే పునాది అని డాక్టర్ అమిత్ వ్యాస్ స్పష్టం చేశారు. వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు, రైతులకు వారి పాలకు సాధ్యమైనంత మెరుగైన ధరను అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు.

‘‘అమూల్ లాభాపేక్షతో నడిచే సంస్థ కాదు. ఇది రైతులకు చెందిన సహకార సంస్థ. రైతులకు గరిష్ట ధరను అందిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరకు అందించడమే మా ఉద్దేశం. అమూల్ సొత్తు అంతా రైతులదే’’ అని ఆయన పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్ నుంచి దేశంలోని తూర్పు ప్రాంతాల వరకు రైతుల సంక్షేమం కోసం అమూల్ తన కార్యకలాపాలను విస్తరిస్తోందన్నారు. అస్సాం, బిహార్‌లో కొత్త ప్లాంట్ల ఏర్పాటు జరుగుతోందని, బిహార్ ప్రభుత్వం భూమిని కేటాయించిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో భారీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగినట్లు చెప్పారు.

చిత్తూరులో రూ.250 కోట్లతో ఐస్‌క్రీమ్ ప్లాంట్

దక్షిణ భారతదేశంలోనూ అమూల్ విస్తరణ వేగంగా కొనసాగుతోందని డాక్టర్ అమిత్ వ్యాస్ తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు.

ఇప్పుడు అదనంగా రూ.250 కోట్లతో అత్యాధునిక, పూర్తిగా ఆటోమేటెడ్ ఐస్‌క్రీమ్ ప్లాంట్ నిర్మిస్తున్నామని తెలిపారు.

చిత్తూరు ప్లాంట్‌లో ఇప్పటికే లిక్విడ్ మిల్క్, మజ్జిగ, పెరుగు, పన్నీర్, తీపి పదార్థాల ఉత్పత్తి జరుగుతోందని, త్వరలో ఐస్‌క్రీమ్ ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. భవిష్యత్‌లో పశువుల దాణా (క్యాటిల్ ఫీడ్) ప్లాంట్ల ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

పీఐబీ హైద‌రాబాద్ నుంచి పీఐబీ ఐఐఎస్ అధికారి వ‌ర్గంటి గాయ‌త్రి నేతృత్వంలో అమూల్ డెయిరీని సందర్శించిన తెలంగాణ జ‌ర్న‌లిస్టుల బృందానికి అమూల్ విశేషాలు తెలుపుతున్న‌ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. అమిత్ వ్యాస్

250కు పైగా ఉత్పత్తులు.. గ్రామం నుంచి మార్కెట్ వరకు సమగ్ర వ్యవస్థ

అమూల్ కేవలం పాల ఉత్పత్తుల బ్రాండ్ మాత్రమే కాదని, గ్రామీణ స్థాయి నుంచి మార్కెట్ వరకు విస్తరించిన సమగ్ర అనుసంధాన వ్యవస్థ అని డాక్టర్ అమిత్ వ్యాస్ వివరించారు.

అమూల్ బ్రాండ్ కింద 250కు పైగా రకాల ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్, ఐస్‌క్రీమ్, తీపి పదార్థాలు తదితర విభాగాల్లో ఉత్పత్తులను అందిస్తున్నామని చెప్పారు.

గుజరాత్‌లోని సుమారు 18,500 గ్రామాలకు అమూల్ సహకార నెట్‌వర్క్ విస్తరించిందని, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ వ్యవస్థను విస్తరిస్తున్నామని తెలిపారు.

పశువైద్యం నుంచి పశువుల దాణా వరకు

రైతులకు కేవలం పాల సేకరణ సేవలే కాకుండా, పాడి పశువుల ఆరోగ్యం, ఉత్పాదకతకు అవసరమైన అనేక సేవలను అందిస్తున్నామని డాక్టర్ వ్యాస్ చెప్పారు.

పశువైద్య సేవలు, టీకాలు, పశువుల దాణా, మిల్కింగ్ మెషిన్లు, పశువుల మ్యాట్లు వంటి సదుపాయాలను అందించడంతో పాటు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.

అంటే.. రైతు పాలు ఇచ్చిన తర్వాతే అమూల్‌తో సంబంధం ఏర్పడటం కాదు. పశువు ఆరోగ్యం నుంచి పాల సేకరణ వరకు రైతు ప్రయాణంలో ప్రతి దశలోనూ సహకరించే వ్యవస్థను అమూల్ నిర్మించిందని ఆయన వివరించారు.

పేడతో బయో-సీఎన్‌జీ.. వ్యర్థాలతో ఎరువులు

పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఆర్థిక వ్యవస్థ దిశగా కూడా అమూల్ అడుగులు వేస్తోంది. భారత్-జపాన్ సహకారంలో భాగంగా 1,000 బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు డాక్టర్ అమిత్ వ్యాస్ తెలిపారు.

బనాస్ కాంతాలో ఇప్పటికే నాలుగు ప్లాంట్లు పూర్తయ్యాయని, ఆనంద్ సమీపంలోని ఊడ్‌లో అత్యాధునిక బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఈ ప్లాంట్‌లో రోజుకు సుమారు 75 నుంచి 100 టన్నుల పేడను సేకరించి గ్యాస్‌గా మార్చి బయో-సీఎన్‌జీగా వినియోగించనున్నట్లు తెలిపారు. మిగిలిన పదార్థంతో బయో-ఎన్‌పీకే ద్రవ ఎరువులను తయారు చేయనున్నట్లు వివరించారు.

ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో గ్యాస్ డిస్పెన్సింగ్ స్టేషన్లు, నేల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉందన్నారు. నేలలోని పోషక లోపాలను గుర్తించి, అవసరమైన ద్రవ ఎరువులను సాంకేతికత ద్వారా పొలాలకు అందించే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

సౌరశక్తి.. డిజిటల్ పశు ఆరోగ్యం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేరా జిల్లాలోని 1,250 సహకార సంఘాలు పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తున్నాయని డాక్టర్ వ్యాస్ తెలిపారు.

అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణ, పశువుల ఆరోగ్యాన్ని ముందుగానే గుర్తించే డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

ఏ రోజున ఎన్ని దూడలు జన్మించాయి, వాటిలో మగ, ఆడ దూడల సంఖ్య ఎంత, వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వంటి వివరాలను డిజిటల్ వ్యవస్థలో నమోదు చేస్తున్నామని తెలిపారు.

2018 తర్వాత 100 శాతం డిజిటలైజేషన్

2018లో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమూల్ డెయిరీని 100 శాతం డిజిటలైజ్ చేసినట్లు డాక్టర్ అమిత్ వ్యాస్ వెల్లడించారు.

పేపర్‌లెస్ వ్యవస్థను అమలు చేయడంతో పాటు, 1946 నుంచి ఇప్పటివరకు ఉన్న సంస్థకు సంబంధించిన సమాచారం, బోర్డు సమావేశాల నిర్ణయాలను డిజిటల్‌గా భద్రపరిచినట్లు తెలిపారు.

కొనుగోలు ఆర్డర్ల నుంచి బ్యాంకు చెల్లింపుల వరకు ప్రతి నిర్ణయాన్ని ఆన్‌లైన్ వ్యవస్థలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, సంస్థ కార్యకలాపాల్లో పారదర్శకత పెంచడమే డిజిటలైజేషన్ లక్ష్యమన్నారు.

ఆరేళ్లలో భారీ వృద్ధి

అమూల్ డెయిరీ ఆర్థిక ప్రగతిని ప్రస్తావిస్తూ డాక్టర్ వ్యాస్ కీలక వివరాలు వెల్లడించారు. సంస్థ చరిత్రలో దీర్ఘకాలికంగా సాధించిన టర్నోవర్‌తో పోలిస్తే, తాను బాధ్యతలు చేపట్టిన తర్వాతి ఆరేళ్లలో గణనీయమైన వృద్ధి నమోదైందన్నారు.

తన బాధ్యతల స్వీకరణ తర్వాత సంస్థ టర్నోవర్ సుమారు రూ.16,500 కోట్ల నుంచి రూ.17,000 కోట్ల స్థాయికి చేరిందని తెలిపారు. గత ఆరేళ్ల నుంచి ఏడేళ్ల కాలంలోనే సుమారు రూ.11,000 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల మేర అదనపు వృద్ధిని సాధించినట్లు వివరించారు.

ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానం

ప్రస్తుతం ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం సుమారు 24 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉందని డాక్టర్ అమిత్ వ్యాస్ తెలిపారు.

2047 నాటికి ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటాను 42 శాతానికి పెంచి, ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల ఎగుమతిదారుగా భారత్‌ను నిలపాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

ఈ లక్ష్య సాధనలో రైతుల ఉత్పాదకత పెంపు, ఆధునిక పశుపోషణ, మెరుగైన సాంకేతికత, పటిష్టమైన మార్కెట్ వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు.

ఆనంద్ నుంచి ప్రారంభమైన శ్వేత విప్లవం

1946లో కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పాటుతో ప్రారంభమైన ఉద్యమమే తరువాత అమూల్ బ్రాండ్‌గా దేశవ్యాప్తంగా విస్తరించింది. డాక్టర్ వర్గీస్ కురియన్ నాయకత్వంలో అభివృద్ధి చెందిన సహకార నమూనా భారతదేశ పాల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసింది.

తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా దేశవ్యాప్తంగా పాడి రైతులను మార్కెట్‌తో అనుసంధానించే భారీ సహకార ఉద్యమం రూపుదిద్దుకుంది.

రైతు యాజమాన్యం, పాలకు స్థిరమైన మార్కెట్, గ్రామీణ ఆదాయానికి మద్దతు, మహిళల భాగస్వామ్యం, పాలు సేకరణ నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు సమగ్ర వ్యవస్థ.. ఇవన్నీ అమూల్ సహకార మోడల్‌కు కీలక స్తంభాలుగా నిలిచాయి.

రైతు ఇంటి నుంచి ప్రపంచ మార్కెట్ వరకు..

ఆనంద్‌లో ప్రారంభమైన ఒక చిన్న సహకార ఉద్యమం.. నేడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ డెయిరీ రంగంలో గుర్తింపు పొందిన వ్యవస్థగా ఎదిగింది.

అమూల్ విజయగాథలో కనిపించేది కేవలం ఒక బ్రాండ్ అభివృద్ధి కాదు. రైతు యాజమాన్యం, సహకారం, సాంకేతికత, నాణ్యత, మార్కెట్ అనుసంధానం కలిసి పనిచేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా బలపడగలదో చూపించే ఒక నమూనా.

అందుకే అమూల్ కథకు అసలు కేంద్రబిందువు ప్యాకెట్‌పై కనిపించే బ్రాండ్ పేరు కాదు.. ఆ ప్యాకెట్ వెనుక నిలిచిన రైతు.

రైతు ఇంటి నుంచి ప్రపంచ మార్కెట్ వరకు.. ఇదే అమూల్ సహకార మోడల్ ప్రత్యేకత.