▪️ చిలీలోని UTEM నుంచి ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్–2026’ పురస్కారం
శాంటియాగో, చిలీ: అంతర్జాతీయ పరిశోధన, అత్యంత కీలకమైన ప్రాజెక్టులు, శాస్త్రీయ సహకార రంగాల్లో విశేష కృషి చేసినందుకు చిలీలోని శాంటియాగోకు చెందిన యూనివర్సిడాడ్ టెక్నోలాజికా మెట్రోపాలిటానా (Universidad Tecnológica Metropolitana (UTEM) అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ప్రవీణ్ బర్మావతుకు అరుదైన గుర్తింపు లభించింది. UTEM అందించే ‘బాహ్య ప్రాజెక్టులకు గుర్తింపు 2026’ (‘Recognition for External Projects 2026’ (Reconocimiento Proyectos Externos 2026)ను ఆయన అందుకున్నారు.
UTEMలోని Departamento de Mecánicaలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. ప్రవీణ్ బర్మావతును ఈ ప్రత్యేక గుర్తింపు కార్యక్రమానికి వ్యక్తిగతంగా ఆహ్వానించారు. UTEM రెక్టర్, అలాగే Consortium of State Universities of Chile (CUECH) అధ్యక్షురాలు మారిసోల్ డురాన్ శాంటిస్ (Marisol Durán Santis) ఆయనకు ఈ గుర్తింపును అందజేశారు.
సూర్యాపేట జిల్లా, కోదాడ పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన డాక్టర్ బర్మావత్ ప్రవీణ్ నాయక్.. అతిసాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చి… మెకానికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించి చిలి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఈ ఘనత సాధించాడు. తన విజయంలో తండ్రి మత్రియా నాయక్, కుటుంబ సభ్యుల ప్రొత్సాహం ఉందన్నారు ప్రవీణ్ నాయక్.

మూడు పోస్ట్‌డాక్టోరల్ ప్రాజెక్టులకు కీలక బాధ్యతలు
డా. బర్మావతు UTEMలో మూడు ANID–FONDECYT పోస్ట్‌డాక్టోరల్ పరిశోధన ప్రాజెక్టులకు స్పాన్సరింగ్ ఇన్విస్టిగేటర్ (Investigador Patrocinante)గా వ్యవహరిస్తున్నారు. అధునాతన పదార్థాలు, థర్మల్ ఇంజినీరింగ్, శక్తి మార్పిడి, శక్తి నిల్వ వంటి కీలక సాంకేతిక రంగాలపై ఈ ప్రాజెక్టులు దృష్టి సారిస్తున్నాయి.
అదేవిధంగా సౌదీ అరేబియాలోనికింగ్ ఫహద్ పెట్రోలియం, ఖనిజాల విశ్వవిద్యాలయం (KFUPM)తో కలిసి నిర్వహిస్తున్న అంతర్జాతీయ పరిశోధన ప్రాజెక్టులో ఆయన ఎక్స్టెర్నల్ ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటర్ (PI)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పర్యావరణ అనువర్తనాల కోసం MXene ఆధారిత అధునాతన పదార్థాల అభివృద్ధిపై ఈ పరిశోధన కొనసాగుతోంది.
DRDO ప్రాజెక్టులోనూ అంతర్జాతీయ నిపుణుడిగా
భారతదేశంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ – నౌకాదళ విజ్ఞాన, సాంకేతిక ప్రయోగశాల (DRDO–NSTL) నిధులతో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (NIT ఆంధ్రప్రదేశ్) సహకారంతో జరుగుతున్న పరిశోధన ప్రాజెక్టులో డా. బర్మావతు అంతర్జాతీయ నిపుణుడు, సహ-ప్రధాన పరిశోధకుడు (Co-PI)గా వ్యవహరిస్తున్నారు. సూపర్క్యావిటేటింగ్ టార్పెడోల పనితీరు, డైనమిక్స్‌పై ఈ ప్రాజెక్టు పరిశోధన సాగిస్తోంది.
175కుపైగా పరిశోధనా పత్రాలు
డా. ప్రవీణ్ బర్మావతు ఇప్పటివరకు 175కుపైగా ‘వెబ్ ఆఫ్ సైన్స్’ జర్నల్స్‌లో సూచిక పరిశోధనా పత్రాలు ప్రచురించారు. రెండు మంజూరైన పేటెంట్లు ఆయన పేరిట ఉండగా, మూడు అకాడమిక్ పుస్తకాలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇంజినీరింగ్ పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో ఆయన చేస్తున్న నిరంతర కృషికి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచింది.
UTEM డిపార్టమెంటో డి మెకానికా డైరెక్టర్ ప్రొఫెసర్. ఫెర్నాండో ఫ్యూయెంటెస్ గుటిరెజ్ (UTEM Departamento de Mecánica డైరెక్టర్ Prof. Fernando Fuentes Gutiérrez) డా. బర్మావతును అభినందించారు. విభాగ పరిశోధనా కార్యకలాపాలకు ఆయన అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. చిలీ, భారత్, సౌదీ అరేబియాతో పాటు అంతర్జాతీయ శాస్త్రీయ సమాజం మధ్య పరిశోధనా సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, బాహ్య నిధులతో కూడిన పరిశోధన, పోస్ట్‌డాక్టోరల్ పరిశోధన అభివృద్ధికి డా. బర్మావతు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు ప్రాధాన్యతను చాటిచెప్పింది.


