• కూకట్‌పల్లి కోర్టు కీలక ఆదేశాలు
  • అసోసియేషన్ నిధులకు రక్షణ.. సెప్టెంబర్‌ 13న జరగాల్సిన జనరల్‌ బాడీ సమావేశంపై మధ్యంతర ఇంజంక్షన్‌

హైదరాబాద్‌: తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA)లో కొనసాగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. సెప్టెంబర్‌ 13న ఇందిరానగర్‌లోని హోటల్‌ అనుపమలో కొందరు నిర్వహించ తలపెట్టిన జనరల్‌ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ కూకట్‌పల్లి రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసినట్లు అసోసియేషన్‌ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి వర్గం తెలిపింది.

సమావేశాల నిర్వహణపై ఆంక్షలు

కే. రాఘవేంద్ర, వై. మెహర్‌ బాబుతో పాటు ఇతర ప్రతివాదులు అసోసియేషన్‌ పేరుతో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని కోర్టు ఆదేశించినట్లు వారు పేర్కొన్నారు. అలాగే అసోసియేషన్‌కు సంబంధించిన లెటర్‌హెడ్‌లు, సీళ్లు, మినిట్స్‌ బుక్‌, అధికారిక సంతకాలను వినియోగించరాదని, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సంఘం తరఫున లేఖలు రాయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు తెలిపారు.

పోలీసులకు అందిన ఫిర్యాదులు, కోర్టులో సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం ఈ మధ్యంతర ఉత్తర్వులు వెలువడినట్లు సుమలతా దేవి వర్గం తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 12కు వాయిదా వేసినట్లు పేర్కొంది.

2025–27 కార్యవర్గమే చట్టబద్ధమైనదని వెల్లడి

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి, జనరల్‌ సెక్రటరీ, ట్రెజరర్‌ ఇజ్రాయెల్‌ మాట్లాడారు. 2025–2027 కాలానికి బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ కార్యవర్గానికే అసోసియేషన్‌ పాలన, అధికారిక కార్యకలాపాలు నిర్వహించే చట్టబద్ధమైన హక్కు ఉందని స్పష్టం చేశారు.

రఘు మాస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వారు పేర్కొన్నారు. అసోసియేషన్‌ నిబంధనల ప్రకారం సుమలతా దేవి విజయం చెల్లుబాటు అవుతుందని తెలిపారు.

రూ.4 కోట్ల సంక్షేమ నిధుల పరిరక్షణ

ఆగస్టు 30న ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కొందరు సమావేశం నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్నారని సుమలతా దేవి ఆరోపించారు. యూనియన్‌ అధికారిక ఈమెయిల్‌ ఐడీని హ్యాక్‌ చేసి, జూబ్లీహిల్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు నకిలీ లేఖలు పంపి ఖాతా సంతకాలను మార్చేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.

సభ్యుల సంక్షేమానికి సంబంధించిన దాదాపు రూ.4 కోట్ల నిధులను కాపాడేందుకే కోర్టును ఆశ్రయించామని ఆమె తెలిపారు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఇకపై అధ్యక్షుడు, జనరల్‌ సెక్రటరీ, ట్రెజరర్‌ ఉమ్మడి సంతకాలతోనే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తామని చెప్పారు.

నిబంధనల ప్రకారమే కొత్త సభ్యత్వాలు

లేబర్‌ ఆఫీస్‌ (JCL) మార్గదర్శకాలకు అనుగుణంగానే కొత్త సభ్యత్వాల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని సుమలతా దేవి వర్గం స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు వ్యక్తులు, ప్యానెల్‌ ఇన్‌చార్జీల నిబంధనలను కఠినతరం చేయడాన్ని తట్టుకోలేక వివాదానికి తెరలేపారని జనరల్‌ సెక్రటరీ ఆరోపించారు.

కేవలం కాగితాలపై సంతకాలు చేసి నలుగురు కలిసి కమిటీగా ఏర్పడితే అది కోర్టుల దృష్టిలోనూ, యూనియన్‌ నిబంధనల ప్రకారం కూడా చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు.

నాలుగైదు రోజుల్లో జనరల్‌ బాడీ సమావేశం?

నకిలీ లెటర్‌హెడ్‌లతో అయోమయం సృష్టించిన వారికి కోర్టు ఉత్తర్వులే సమాధానమని ట్రెజరర్‌ ఇజ్రాయెల్‌ అన్నారు. ఫెడరేషన్‌ అధ్యక్షుడు అనిల్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఫెడరేషన్‌ పెద్దల సమక్షంలో నాలుగైదు రోజుల్లో అధికారికంగా జనరల్‌ బాడీ సమావేశాన్ని నిర్వహించి, మిగిలిన సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా యూనియన్‌ కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని నృత్య కళాకారులు, డ్యాన్స్‌ డైరెక్టర్లకు వారు విజ్ఞప్తి చేశారు.