▪️ చేవెళ్ల దళిత డిక్లరేషన్ అమలుపై ఇందిరా పార్క్‌లో మహాధర్నా
▪️ ఎస్సీ, చేవెళ్ల డిక్లరేషన్ హామీలపై ఉద్యమం మొదలైంది
▪️ హామీలు అమలు చేయాలి.. హక్కులు దక్కాలి
▪️ గద్దె దిగుతారా? చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేస్తారా?
▪️ ధర్నాలో పాల్గొన్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్
▪️ తీగల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మహాధర్నా
▪️ మాటలు కాదు దళితులకు న్యాయం చేయండి: బైరి వెంకటేశం
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్‌లోని 12 ప్రధాన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద “చలో ఇందిరా పార్క్ – మహాధర్నా” భారీ ఎత్తున జరిగింది. దళిత సంఘాల నాయకులు తీగల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాలో భారత చైతన్య యువజన పార్టీ (BCY పార్టీ) నాయకులు, వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు, యువత, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి దళితుల ద్రోహులుగా మిగిలిపోయారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజ్యాంగబద్ధ హక్కులు కేవలం ఎన్నికల నినాదాలుగా మిగిలిపోకూడదని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రతి హామీని యథాతథంగా అమలు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మహాధర్నా ఇన్‌చార్జి, దళిత సంఘాల నాయకులు తీగల అశోక్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 59 షెడ్యూల్డ్ కులాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం హామీల అమలులో జాప్యం చేయడం బహుజన సమాజానికి అన్యాయం అని పేర్కొన్నారు. శాంతియుత, రాజ్యాంగబద్ధ పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకుంటామని తెలిపారు.
57 ఎంబి ఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. చేవెళ్ల డిక్లరేషన్‌లోని 12 అంశాలను వెంటనే ప్రభుత్వ ఉత్తర్వుల రూపంలో అమలు చేయాలని, షెడ్యూల్డ్ కులాలు, గిరిజనుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు:
▪️ ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచడం.
- కులధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వాలి
▪️ ప్రైవేట్ రంగం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం.
▪️ అంబేడ్కర్ అభయహస్తం పథకం కింద ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించడం.
▪️ ఇల్లు లేని ప్రతి కుటుంబానికి రూ.6 లక్షలతో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడం.
▪️ అసైన్డ్ భూముల పునరుద్ధరణ లేదా భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం.
▪️ అటవీ హక్కుల చట్టాన్ని సమర్థంగా అమలు చేసి పోడు భూముల పట్టాలు ఇవ్వడం.
▪️ మాల, మాదిగ, 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్ కి ఏడు వందల కోట్ల నిధులు కేటాయించడం.
▪️ ప్రతి మండలంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు ఏర్పాటు చేయడం.
▪️ విద్యార్థులకు ‘విద్యా జ్యోతుల’ పథకం ద్వారా విద్యా ప్రోత్సాహకాలు అందించడం.
▪️ విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం.
దళిత సంఘాల నాయకులు తీగల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌తో పాటు, ప్రొఫెసర్ సూరజ్ మండల్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, బైరి వెంకటేశం, ఉపదే సనాధన్, పొట్టపింజర రమేష్, మాదిగ, బొమ్మేర శ్రీనివాస్ మాదిగ, రాయిల లక్ష్మి నర్సయ్య చిందు, మంచాల లింగస్వామి మాల ప్రజాఫ్రంట్ చిన్న స్వామి మాష్టి, దళిత ఉద్యమ నాయకుడు జేబీ రాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. “మన హక్కులు ఎవరూ ఉచితంగా ఇవ్వరు.. ఐక్యంగా పోరాడి సాధించుకోవాల్సిందే” అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చేవెళ్ల డిక్లరేషన్‌లోని హామీలను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
