తోటి కళాకారుడికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న అయినాబత్తిన ధశరధ.. ‘కిల్లర్’ విజయానికి రామచంద్ర శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న అయినాబత్తిన ధశరధ తన ఉదారతను చాటుకున్నారు. ప్రముఖ తెలుగు చిత్రం ‘వెంకీ’ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన.. స్వయంగా పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో తోటి కళాకారుడికి అండగా నిలిచి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.

బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం సమస్యలతో బాధపడుతున్న రామచంద్ర ప్రస్తుతం చికిత్స, పునరావాస ప్రక్రియలో ఉన్నారు. ఆయన పరిస్థితిని తెలుసుకున్న దశరధ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తోటి కళాకారులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అయినాబత్తిన ధశరధ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర కళాకారులంతా ఒక కుటుంబంలా ముందుకొచ్చి రామచంద్రకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన చికిత్సకు మరింత ఆర్థిక సహాయం అందేలా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.

దశరధ చూపిన ఆప్యాయతకు, అందించిన సహాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఆయన మంచి మనసును అభినందించారు. ఈ సందర్భంగా అయినాబత్తిన ధశరధ వెండితెర ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, అక్టోబర్ 30న విడుదల కానున్న ‘కిల్లర్’ చిత్రం ఘనవిజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం ‘కిల్లర్’ చిత్రంలో నటిస్తూ, లైన్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్న అయినాబత్తిన ధశరధ.. టీవీ5 డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేటివ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కష్టాల్లో ఉన్న తోటి కళాకారులకు అండగా నిలవడం సినీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని దశరధ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పరస్పర సహకారం, సానుభూతి, ఐక్యతతో రామచంద్రకు అవసరమైన చికిత్సా సహాయం అందించేందుకు సినీ పరిశ్రమ ముందుకు రావాలని కోరారు.

కళాకారుల మధ్య ఉండాల్సిన ఆత్మీయతకు, మానవత్వానికి అయినాబత్తిన ధశరధ చేసిన సహాయం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. రామచంద్ర త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.