ఆదర్శ విద్యాసేవకు ఘన సన్మానం

MULUGU (Breaking Now): ములుగు జిల్లా దేవగిరిపట్నం జడ్పీహెచ్ఎస్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇనుగాల సూర్యనారాయణ పదవీ విరమణ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు నాగవరపు శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సూర్యనారాయణకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయుడిగా ఆదర్శవంతమైన సేవలు అందించడంతో పాటు పలు ఉన్నత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఇనుగాల సూర్యనారాయణ విద్యారంగానికి విశేష సేవలు చేశారని కొనియాడారు. ముఖ్యంగా ములుగు జిల్లా పరీక్షల నిర్వహణ కార్యదర్శిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

అదే సందర్భంగా డీఎన్‌ఆర్ విద్యా సేవా సంస్థ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్థ అధినేత దొడ్డ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో 100కు పైగా వివిధ రకాల పూల మొక్కలను నాటారు. డీఎన్‌ఆర్ ట్రస్ట్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయని డీఈఓ ప్రశంసించారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో వన మహోత్సవాన్ని నిర్వహించి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.

డీఎన్‌ఆర్ విద్యా సేవా సంస్థ అధినేత దొడ్డ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, తన స్నేహితుడు ఇనుగాల సూర్యనారాయణ పదవీ విరమణ సందర్భంగా వన మహోత్సవాన్ని నిర్వహించే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి పాఠశాలలో విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సంకల్పంతోనే దేవగిరిపట్నం పాఠశాలలో 100 మొక్కలను నాటినట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లాలోని ప్రతి పాఠశాల “స్వచ్ఛ పాఠశాల – హరిత పాఠశాల”గా రూపుదిద్దుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి పదవీ విరమణ పొందిన ఇనుగాల సూర్యనారాయణ–లక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో దేవగిరిపట్నం గ్రామ సర్పంచ్ పూలమ్మ, ఉపసర్పంచ్ రాజు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, ములుగు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.