• ఎకరాకు లక్షన్నర వరకు ఆదాయం..
  • రైతుకు కనీసం రూ.80 వేల వరకు మిగులు
  • ఉప్పునుంతలలో విస్తరిస్తున్న సాగు.. స్థానికంగానే కొనుగోళ్లు..
  • 15 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ

ఉప్పునుంతల: రైతు ఆదాయం పెరగాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ సాగు రైతులకు ఆశాజ్యోతిగా మారుతోంది. ఒకప్పుడు సంప్రదాయ పంటలతో నష్టాలు చవిచూసిన రైతులు ఇప్పుడు ఆయిల్ పామ్ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, కొనుగోలు హామీ, సకాలంలో చెల్లింపులు రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఈ పంటతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

ఆయిల్ పామ్ సాగులో ఎకరాకు సుమారు రూ.1.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగు ఖర్చులు తీసివేసిన తర్వాత కూడా కనీసం రూ.80 వేల వరకు రైతుకు మిగులుతుందని చెబుతున్నారు. ఒకసారి నాటితే దాదాపు 20 సంవత్సరాల పాటు దిగుబడులు ఇచ్చే పంట కావడంతో రైతులు దీన్ని లాభసాటి పంటగా భావిస్తున్నారు.

2022లో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించింది. అప్పట్లో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా, ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు ఈ పంటను సాగు చేశారు. ఇప్పుడు మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత దిగుబడులు రావడంతో రైతుల శ్రమకు ఫలితం దక్కుతోంది. ప్రభుత్వం ప్రస్తుతం టన్నుకు సుమారు రూ.23,852 చెల్లిస్తూ, కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన నగదును 15 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.

ఉప్పునుంతలలో 679 ఎకరాల్లో సాగు

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో ప్రస్తుతం 167 మంది రైతులు 679 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ఈ పంటపై రైతుల్లో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మరో 500 ఎకరాల్లో కొత్తగా సాగు చేసేందుకు రైతులు దరఖాస్తులు చేసుకున్నట్లు పామ్ ఆయిల్ ఏరియా మేనేజర్ శివ భార్గవ్ వెల్లడించారు.

స్థానికంగానే కొనుగోళ్లు… రైతులకు ఊరట

ఆయిల్ పామ్ పంటను ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కట్లబండ గోదాం వద్దనే కొనుగోలు చేస్తున్నారు. వే-బ్రిడ్జి సహా అన్ని సౌకర్యాలు ఒకేచోట అందుబాటులో ఉండటంతో రైతులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. రవాణా ఖర్చు, సమయం రెండూ ఆదా అవుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

15 రోజుల్లోనే చెల్లింపులు

రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన చెల్లింపులు గరిష్ఠంగా 15 రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. వరి కొనుగోళ్ల మాదిరిగానే పారదర్శకంగా, వేగంగా చెల్లింపులు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి 15 రోజులకు ఒకసారి లారీల ద్వారా పంటను తరలిస్తూ కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు.

మూడేళ్ల వరకు అంతర పంటల సాగుకు అవకాశం

ఆయిల్ పామ్ మొక్కలు నాటిన తర్వాత తొలి మూడు సంవత్సరాల వరకు మొక్కల మధ్య ఖాళీ ప్రదేశంలో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. వేరుశనగ, మినుములు, పెసర్లు, కూరగాయలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. మండలంలోని రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ద్విగుణీకృత లాభాలు పొందుతున్నారు.

రైతు మాట

“నాలుగేళ్ల క్రితం ఐదు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించాను. మూడున్నర సంవత్సరాలకు దిగుబడి వచ్చింది. నాలుగేళ్లలో సుమారు రూ.4 లక్షల పెట్టుబడి పెట్టాను. ఇప్పటివరకు నాలుగు టన్నుల పంట విక్రయించాను. టన్నుకు సుమారు రూ.24 వేల వరకు ధర లభిస్తోంది. మంచి లాభాలు వస్తుండటంతో ఎంతో సంతోషంగా ఉంది. ఇతర రైతులు కూడా ధైర్యంగా ఈ పంట సాగు చేయొచ్చు.”

— కస్తూరి శ్రీహరి, రైతు, జప్తి సదగోడు