సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌పై సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘సన్ ఆఫ్’. దర్శకుడు బత్తుల సతీష్ ఈ చిత్రాన్ని భావోద్వేగాలకు ప్రధాన్యత ఇస్తూ రూపొందించారు. వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం తండ్రీ–కొడుకుల అనుబంధాన్ని ఎంత ప్రభావవంతంగా చూపించిందో చూద్దాం.
కథ:
వెంకట్రావు (వినోద్ కుమార్) భార్య మరణంతో తన కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రి)నే తన ప్రపంచంగా భావించి పెంచుతాడు. కానీ ఆనంద్ మాత్రం తండ్రి ఆశలకు అనుగుణంగా ఎదగడు. చదువుల్లో విఫలమవుతూ, బాధ్యత లేకుండా గడిపే యువకుడిగా కనిపిస్తాడు.
చిన్ననాటి నుంచి అను (మీరా రాజ్)తో ఉన్న ప్రేమ కథ పెళ్లి దశకు చేరుతుంది. ఇరు కుటుంబాలు కూడా అంగీకరిస్తాయి. అయితే ఎంగేజ్‌మెంట్ సమయానికి వెంకట్రావు అడ్డుపడతాడు. “పని పాట లేని నా కొడుకు ఎలా నచ్చాడు?” అంటూ అందరి ముందు ప్రశ్నిస్తూ పరువు తీస్తాడు.
అవమానాన్ని తట్టుకోలేని ఆనంద్, తనకు రావాల్సిన ఆస్తి కోసం తండ్రిపైనే కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఆస్తి ఇవ్వడానికి తండ్రి పెట్టిన షరతు ఏమిటి? జీవితం అంటే ఏమిటో, బాధ్యతల బరువు ఎంతనో ఆనంద్ గ్రహిస్తాడా? ప్రేమను గెలుచుకుంటాడా? అన్నదే సినిమా సారాంశం.

నటీనటులు:
సాయి సింహాద్రి తొలి సినిమానే అయినా, ఎక్కడా కొత్త హీరో అన్న భావన కలగదు. కామెడీ నుంచి ఎమోషన్ వరకు అన్ని కోణాల్లోనూ సమర్థంగా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో బాధ్యతల్ని మోసే యువకుడిగా అతని నటన హృదయానికి హత్తుకుంటుంది.
వినోద్ కుమార్ తండ్రి పాత్రలో తన అనుభవాన్ని చాటారు. కఠినత్వం వెనుక దాగిన ప్రేమను అద్భుతంగా చూపించారు. కొత్త హీరోయిన్ మీరా రాజ్ అందంగా కనిపించడమే కాకుండా, భావోద్వేగ సన్నివేశాల్లో మెప్పించింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ:
తండ్రీ–కొడుకుల నేపథ్యంతో ఎన్నో కథలు వచ్చినా, ‘సన్ ఆఫ్’ కథలో ప్రత్యేకమైన మలుపు ఎమోషనల్ ట్రీట్‌మెంట్‌లోనే ఉంది. యువతలో బాధ్యతల లోపం, జీవిత విలువలపై అవగాహన అవసరమనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది.
ఫస్ట్ హాఫ్ సరదాగా, ప్రేమ–కామెడీ ట్రాక్‌తో సాగుతుంది. అసలు సంఘర్షణ ఇంటర్వెల్ బ్లాక్‌లో మొదలవుతుంది. కోర్టు సన్నివేశాలు, తండ్రి పెట్టే షరతు కథకు కొత్త మలుపు తీసుకొస్తాయి. సెకండాఫ్‌లో బిడ్డను పెంచే బాధ్యతను మోసే హీరో ప్రయాణం హృదయాన్ని తాకుతుంది. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. మొత్తంగా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పూర్తి సంతృప్తి కలిగించే సినిమా అనే ఫీలింగ్ ఇస్తుంది.
సాంకేతిక విభాగం:
ఈ చిత్రానికి సంగీతం, విజువల్స్ ప్రధాన బలాలు. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగే పాటలు కథనానికి బలం చేకూర్చాయి. గ్రామీణ వాతావరణాన్ని కెమెరామెన్ అందంగా చూపించారు. ఎడిటింగ్ కట్టుదిట్టంగా ఉండటంతో సినిమా ఎక్కడా బోర్ అనిపించదు. ఆర్ట్, కాస్ట్యూమ్స్ సహా అన్ని విభాగాలు చక్కటి పనితీరును కనబర్చాయి.
తొలి సినిమా అయినప్పటికీ నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా సాయి సింహాద్రి ఉన్నతమైన ప్రొడక్షన్ విలువలను చూపించారు.
తుది తీర్పు:
తండ్రీ–కొడుకుల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించిన ఎమోషనల్ డ్రామా ‘సన్ ఆఫ్’. బాధ్యత, ప్రేమ, బంధాల విలువను గుర్తు చేసే ఈ చిత్రం కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా.
- రేటింగ్: 3/5
