- అతిరథ మహారథులతో అమెరికా గడ్డపై తెలుగు వైభవం
- సర్వం సిద్ధమవుతున్న బాల్టిమోర్ వేదిక
హైదరాబాద్ (బ్రేకింగ్ నౌ): ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభలు ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా ఆధ్వర్యంలో అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. అతిరథ మహారథులు ఈ సభల్లో సందడి చేయబోతున్నారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, కళలు, వ్యాపారం, విద్య, సాంకేతికత, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష కృషి చేస్తున్న తెలుగు ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ మహాసభలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఆటా నాయకులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను ఆహ్వానించారు.
తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె. అరుణ, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరామ్ నాయక్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసనసభ సభ్యులు యెన్నం శ్రీనివాస రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చామకూర మల్లా రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత ఎన్. రాంచందర్ రావు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఏపీఎన్ఆర్టీ సొసైటీ చైర్మన్ డా. రవి వేమూరు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య వేదికలు, యువతకు ప్రత్యేక సెషన్లు, వ్యాపార సదస్సులు, మహిళా సాధికారత కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, వినోదాత్మక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఒకే కుటుంబంగా కలిపే ఈ మహాసభలు తెలుగు ఐక్యతకు ప్రతీకగా నిలవనున్నాయని నిర్వాహకులు తెలిపారు. బాల్టిమోర్‌లో నిర్వహించనున్న ఈ వేడుకలకు ప్రవాస తెలుగు కుటుంబాలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆటా నిర్వాహకులు ఆహ్వానించారు.

