గద్దర్ ఫిలిం అవార్డు అందుకున్న ‘వనజీవి రామయ్య’ జానకమ్మగా మెప్పించిన నటి నాగరాణి
తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిలిం అవార్డును అందుకున్న ‘వనజీవి రామయ్య’ డాక్యుమెంటరీలో జానకమ్మ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వర్ధమాన నటి నాగరాణి తన నటనా ప్రయాణం, అనుభవాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి పంచుకున్న విశేషాలు ఇవి.
- ‘వనజీవి రామయ్య’ మూవీకి గద్దర్ ఫిలిం అవార్డు రావడం ఎలా అనిపించింది?
నాగరాణి: మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నాకు మాత్రమే కాదు, మొత్తం మా టీంకి వచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. “వనజీవి రామయ్య” సినిమా వెనుక ఉన్న ప్రతి ఒక్కరి కృషికి ఇది ఒక గుర్తింపు. ఈ అవార్డు రావడం వల్ల మేము చేస్తున్న పని సరైన దిశలో ఉందనే నమ్మకం మరింత బలపడింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సందేశాత్మక సినిమాలు చేయాలనే సంకల్పానికి ఇది మరింత శక్తినిచ్చింది.
- ‘వనజీవి రామయ్య’ సినిమాలోకి మీ ఎంపిక ఎలా జరిగింది?
నాగరాణి: బ్రహ్మాజీ గారితో కథాకళి సినిమా చేస్తున్న సమయంలో ఆయన నన్ను దర్శకుడు వేముగంటి గారికి సూచించారు. నా గత పనిని గమనించిన దర్శకుడు ఈ పాత్రకు నేను సరిపోతానని భావించి అవకాశం ఇచ్చారు. కథ విన్న వెంటనే ఈ పాత్రపై నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఇది సాధారణ పాత్ర కాదు, బాధ్యతతో చేసిన పాత్రగా భావిస్తున్నాను.

- జానకమ్మ పాత్రలో మమేకం కావడానికి ఎలా సిద్ధమయ్యారు?
నాగరాణి: ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాను. వనజీవి రామయ్య గారి జీవితం, ఆలోచనలు, జీవనశైలి గురించి లోతుగా తెలుసుకున్నాను. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అనుభవాలు తెలుసుకున్నాను. బాడీ లాంగ్వేజ్, భావప్రకటన సహజంగా రావడానికి రిహార్సల్స్ చేశాను. షూటింగ్ సమయంలో పూర్తిగా పాత్రలోనే ఉండేలా నా వ్యక్తిగత జీవితం నుంచి కూడా కొంతవరకు దూరంగా ఉన్నాను. దర్శకుడు చెప్పిన సూచనలను పూర్తిగా అనుసరిస్తూ నా శక్తిమేరకు శ్రమించాను.
- రామయ్య గారి కుటుంబ సభ్యుల స్పందన ఎలా అనిపించింది?
నాగరాణి: వారి కుటుంబ సభ్యులు సినిమా చూసి భావోద్వేగానికి గురవడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. “మీరు మా జానకమ్మలా కనిపించారు” అని వారు చెప్పడం నాకు మరింత బాధ్యతను కలిగించింది. వారి కళ్లలో కనిపించిన ఆనందం ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి.
- మీ నటనా ప్రయాణం గురించి చెప్పండి.
నాగరాణి: నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉండేది. స్కూల్, కాలేజ్ దశలో స్టేజ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేదాన్ని. తర్వాత కొంతకాలం చదువుల కారణంగా నటనకు దూరమయ్యాను. అయితే ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించాను. ప్రారంభంలో తిరస్కారాలు ఎదురైనా నమ్మకం కోల్పోలేదు. అదే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది.

- దర్శకుడు, యూనిట్‌తో పని చేసిన అనుభవం ఎలా ఉంది?
నాగరాణి: దర్శకుడు గారు ఎంతో విజనరీ. ప్రతి సన్నివేశాన్ని స్పష్టంగా వివరించేవారు. యూనిట్ మొత్తం ఒక కుటుంబంలా పనిచేసింది. ముఖ్యంగా బ్రహ్మాజీ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన సరదా స్వభావం, సహనం నాకు మంచి ప్రేరణ ఇచ్చాయి.
- మీ కెరీర్ ప్రారంభంలో ఎదురైన సవాళ్లు ఏమిటి?
నాగరాణి: ప్రారంభంలో కొన్ని అవకాశాలు వచ్చినా పూర్తిగా అమలుకాలేదు. కొన్ని పాత్రలు మారిపోయాయి కూడా. అయితే నేను మాత్రం “నా పని నేనే మాట్లాడాలి” అనే నమ్మకంతో ముందుకు సాగాను. సింగిల్ టేక్స్లో నటించేందుకు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసేదాన్ని. కష్టపడి పనిచేయడం తప్ప ఇతర విషయాలపై దృష్టి పెట్టలేదు.

- మీకు గుర్తుండిపోయే ప్రారంభ అవకాశాలు ఏవీ?
నాగరాణి: నా మొదటి వెబ్‌సిరీస్ ATM (దిల్ రాజు ప్రొడక్షన్స్, హరీష్ శంకర్ రచన) నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. ఆ షూటింగ్లో నా నటనను అందరూ అభినందించారు. అలాగే జితేందర్ రెడ్డి సినిమాలో పనిచేసినప్పుడు డీఓపీ జ్ఞానశేఖర్ గారు, దర్శకుడు విరించి గారు కూడా ప్రోత్సహించారు. స్వాగ్ సినిమా కుడ చాలా హెల్ప్ అయింది, సినిమా రిలీజ్ అయ్యాక మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇది నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్లా మారింది. GOAT సినిమా దర్శకుడు వేదవ్యాస్ గారు, అలాగే KGF, Salaar చిత్రాల కో-డైరెక్టర్ కీర్తన్ నడగౌడ గారు కూడా నా నటనపై ప్రశంసలు తెలిపారు. ఇవన్నీ నాకు ఎంతో ప్రేరణగా నిలిచాయి.
- భవిష్యత్తులో మీరు చేయాలనుకునే పాత్రలు ఎలా ఉండాలి అనుకుంటున్నారు?
నాగరాణి: ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రలు చేయాలని ఉంది. సమాజానికి సందేశం ఇచ్చే కథల్లో నటించడం నా లక్ష్యం. పాజిటివ్, నెగటివ్, కామెడీ, ఎమోషనల్—అన్ని రకాల పాత్రల్లో నా ప్రతిభను చూపించాలని కోరుకుంటున్నాను. ప్రతి సినిమా ద్వారా కొత్తగా నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.



