హైదరాబాద్‌లోని HITEX Exhibition Centre రెండో హాల్‌లో నిర్వహించిన ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. నిన్న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన చెన్నైకి చెందిన అన్యానప్పకు ₹5 లక్షల ప్రైజ్ మనీతో మొదటి బహుమతి లభించింది. రెండో బహుమతిగా మిత్రోబాకు ₹3 లక్షలు, మూడో బహుమతిగా హరికృష్ణకు ₹1 లక్ష అందజేశారు. వివిధ కేటగిరీలు, ర్యాంకింగ్‌ల ప్రకారం మిగతా మొత్తం ₹13,22,222లను విజేతలకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన Feroz Khan మాట్లాడుతూ— పిల్లల్లో ఏకాగ్రత, మేధాశక్తి పెంపొందించడంలో చెస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ క్రీడలో రాణించాలంటే కష్టపడి సాధన చేయాల్సిందేనని, నిరంతర శ్రమే విజయానికి మార్గమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందకరమని అన్నారు. గెలుపు–ఓటములు ఆటలో సహజమని, గెలిచినా ఓడినా మళ్లీ మళ్లీ ఆడుతూ ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తారని సూచించారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు Anup Rubens మాట్లాడుతూ, పిల్లల్లో ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో ఏకాగ్ర అకాడమీలో శిక్షణ పొంది ఫిడే రేటింగ్ సాధించిన హైదరాబాద్‌కు చెందిన కవలలు అమాయ అగర్వాల్, అనయ్ అగర్వాల్లను నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కవలల ద్వారా అకాడమీకి ప్రత్యేక గుర్తింపు లభించిందని పేర్కొంటూ వారిని సత్కరించారు.

అలాగే సినీనటుడు Gemini Suresh మాట్లాడుతూ— తెలంగాణలో ₹22,22,222 భారీ ప్రైజ్ మనీతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందకరమని, ఈ వాతావరణం చూసి తన పిల్లలకు కూడా చెస్ నేర్పించాలనే ఆలోచన కలిగిందన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రాండ్‌మాస్టర్లు దీపెన్, సేతురామన్, అంతర్జాతీయ మాస్టర్లు, కోచ్‌లు, పిల్లల తల్లిదండ్రులు, అకాడమీ చైర్మన్ పానషా, ఆమె భర్త వరుణ్ అగర్వాల్, సీనియర్ జర్నలిస్ట్ అంజలి, ఏకాగ్ర డైరెక్టర్లు సందీప్ నాయుడు, చైతన్య నాయుడు, గిరీష్ రెడ్డి, నితిన్, సౌజన్య జాను తదితరులు పాల్గొన్నారు.