- స్వామి ముద్దం
చీకట్లను చీల్చుకుంటూ.. ఆరు దశాబ్దాల ఆక్రందనలను జయిస్తూ.. మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి పుష్కర కాలం పూర్తయింది!
ఆరు దశాబ్దాల పోరాట కాలంలో ఎన్నో భావోద్వేగాలు.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన ‘జై తెలంగాణ’ ఆవాజ్, అమరుల బలిదానాల్లో ఆరిపోయిన ప్రాణాలు, కష్టాల నడుమ, గాయాల నడుమ, వొడితిరుగుతున్న కడుపుకోతలు, లక్షల గొంతులు చించుకోని ఎగిసిపడ్డ నినాదాలు, బిగుసుకున్న పిడికిల్లు, కుట్రల్ని కుటిలాల్ని ఎప్పటికప్పుడు ఎదిరించిన వ్యూహాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, అక్షరాలు, ఆటపాటలు, కోటి ఆరాటాలు ఒక్కటై ఒక ఆధిపత్యాన్ని గెలిచినయి. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించిన ఉద్యమం తెలంగాణ ఉద్యమమొక్కటే. మన కాలపు చరిత్ర, మన కండ్ల ముందటి విజయం. తెలంగాణ ప్రజల కండ్లల్ల వెలుగు నిండింది. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం..
సవాళ్లు – సమకాలీన వాస్తవాలు
విజయం సిద్ధించిన తర్వాత సవాళ్లు ఎదురవ్వడం సహజం. ఇప్పుడు వికాసం వైపు మన అడుగులు మరింత వడిగా, బలంగా పడాలె. ఇక్కడి స్థానిక వనరులు, సహజ సంపదలు పరాయిపాలు కాకుండా.. కేవలం తెలంగాణ బిడ్డల బతుకుల్లో పచ్చదనం నింపడానికే వినియోగపడాలె.
వివిధ అస్తిత్వాలు, సామాజిక సమూహాలు తమ హక్కుల కోసం, సందేహాల కోసం గళం విప్పడం ప్రజాస్వామ్య లక్షణం. వైరుధ్యాలు, సంఘర్షణలు సహజమే.. కానీ వాటన్నింటినీ సవ్యంగా, సామరస్యంగా పరిష్కరించుకోగలగాలే. పరస్పర అవగాహనతో, అందరి ఆలోచనలను క్రోడీకరించి తెలంగాణను ఒక “బంగారు తునక”గా మార్చుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడిన మన ప్రత్యేక రాష్ట్రం.. నాటి ఆకాంక్షలకు అద్దం పడుతోందా? లేదా? అనే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
పునర్నిర్మాణం: నాలుగున్నర కోట్ల ప్రజల కల
తెలంగాణ పునర్నిర్మాణం అంటే కేవలం భవనాల నిర్మాణం కాదు.. కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవడం! నాలుగున్నర కోట్ల ప్రజల కలల సాకారం! ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగినవి:
ఉచిత, నాణ్యమైన విద్య, వైద్యం
రైతును రాజును చేసే వ్యవసాయ విధానం
తెలంగాణ అస్తిత్వ సాంస్కృతిక వైభవం
స్వేచ్ఛ-సౌబ్రాతృత్వం, పౌర హక్కుల రక్షణ
స్వపరిపాలనలో ఇవన్నీ సాధ్యమవుతాయనే నమ్మకంతోనే, నాాడు త్యాగాల బాటలో ఉద్యమం నడిచింది. వివిధ రూపాల్లో, సుదీర్ఘకాలం పోరాడిన వీరోచిత చరిత్ర యావత్ తెలంగాణ ప్రజలది. ఈ క్రమంలో అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం జరగలె..
పాలకుల ప్రథమ కర్తవ్యం:
“నీళ్లు, నిధులు, నియామకాలు” అనే త్రినేత్ర నినాదంతో సాగిన ఈ ఉద్యమం అనేక పాయలుగా సాగింది. ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, బహుజన తెలంగాణ ఇలా పలుజెండాలతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమ జ్వాల ఇది. కాబట్టి, నాటి ఉద్యమకారుల, మేధావుల సలహాలు, సూచనలను స్వీకరించి, అమలు చేయగల రాజకీయ నాయకత్వం నేడు అత్యంత అవసరం. త్యాగాల గాయాలతో తల్లడిల్లిన ప్రజల ఆశలను నెరవేర్చడమే పాలకుల పరమావధి కావాలె.
ముగింపు: అస్తిత్వ చైతన్యమే మన బలం!
తెలంగాణ నేల ఎన్నో వీరపోరాటాలకు, త్యాగాలకు, ఆత్మగౌరవానికి సాక్ష్యంగా నిలిచింది. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఉద్యమం ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, స్వాభిమాన సాధన కోసం సాగింది. ఈ పోరాటాల వారసత్వాన్ని మనం ఎప్పటికీ మరువలేం.
తెలంగాణ ఉద్యమం అనేది ఒక అస్తిత్వ చైతన్యఫలం. మన వికాసం కూడా ఆ అస్తిత్వ పునాదుల మీదనే జరగాలె. అభివృద్ధి అనేది పాలకుల అజెండాలో కాదు.. ప్రజల జీవితాలతో అనుసంధానమై సాగాలె. సాగుతున్న తెలంగాణ పునర్నిర్మాణానికి రాజకీయ అస్తిత్వం, సాంస్కృతిక అస్తిత్వం రెండు కళ్ల లాంటివి. అవి బలంగా ఉన్నప్పుడే తెలంగాణ ఆత్మ పరిఢవిల్లుతది. ఆ ఎరుకతో, ఆ హెచ్చరికతోనే ఇక్కడి బిడ్డలు కలలుగన్న సరికొత్త, సమసమాజ తెలంగాణ ఆవిర్భవిస్తది!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో..
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
- స్వామి ముద్దం
#swamymuddam

