కామారెడ్డి జిల్లా ,లింగంపేట్ మండలం పరమల గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకి నూతన రూపు వచ్చింది. Telangana Development Forum USA (TDF USA) అట్లాంటా చాప్టర్ వారి సౌజన్యంతో ‘TDF – మన తెలంగాణ బడి’ ప్రాజెక్టులో భాగంగా నూతన పాఠశాల భవనం, నాలుగు క్లాస్‌రూమ్‌లను ప్రారంభించారు.
గ్రామ ప్రజలు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు TDF ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సుశీల్, వాణి గడ్డం పాఠశాలను సందర్శించి అక్కడి దయనీయ పరిస్థితులను పరిశీలించారు. ఆపై పాఠశాల అభివృద్ధికి అండగా నిలవాలని నిర్ణయించిన TDF USA బృందం, అట్లాంటా చాప్టర్ ద్వారా పరమల ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. ఈ కార్యక్రమానికి TDF USA అధ్యక్షులు శ్రీనివాస్ మణికొండతో పాటు స్వాతి సూదిని, తోట గణేష్, వాణి గడ్డం, విక్రమ్ తదితరులు ఆర్థిక సహకారం అందించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ—గతంలో ప్రభుత్వానికి పలుమార్లు విన్నపించినా సహాయం అందలేదని, అయితే TDF వెంటనే స్పందించి అతి తక్కువ కాలంలోనే నాలుగు క్లాస్‌రూమ్‌లు నిర్మించి పాఠశాలకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించిందని కొనియాడారు. మారుమూల గ్రామంలో విద్యాభివృద్ధికి TDF చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని జిల్లా, గ్రామ ప్రజలు అభినందించారు.
TDF ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ—‘మన తెలంగాణ బడి’ ప్రాజెక్టు ద్వారా మారుమూల ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే గతంలో TDF USA మాజీ చైర్మన్ గాదే గోపాల్ రెడ్డి అధ్యక్షతన రూపొందించిన “స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ” నివేదికను ప్రభుత్వానికి అందించామని, దానిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించి ఉన్నత విద్యపై కూడా నివేదిక ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. ఆ మేరకు నిపుణుల బృందం ఉన్నత విద్యపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించిందని పిడిఎఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ సుశీల్ గారు తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ముందుండాలని TDF USA మాజీ అధ్యక్షురాలు కవిత చల్లా, అట్లాంటా చాప్టర్ సభ్యురాలు వాణి గడ్డం సూచించారు. ఆరోగ్యం, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని TDF USA మాజీ అధ్యక్షులు డాక్టర్ దివేష్ అనిరెడ్డి, TDF ఇండియా వైస్ ప్రెసిడెంట్ పాటి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు TDFకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్య, మహిళా అభివృద్ధి, ఆరోగ్య రంగాల్లో అవసరమైన సహకారం అందిస్తామని TDF ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ దివేష్ అనిరెడ్డి, కవిత చల్ల , టి.వాణి , పాటి నరేందర్ రెడ్డి, మట్ట రాజేశ్వర్ రెడ్డి, సుశీల్, తోట గణేష్, వాణి గడ్డం, మండల విద్యా అధికారి షౌకత్ అలీ, TDF కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
