హైదరాబాద్, జూన్ 20: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంగా నిర్వహించనున్న CSR సమ్మిట్-2026 అధికారిక పోస్టర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. జూలై 25, 2026న నిర్వహించనున్న ఈ ప్రతిష్ఠాత్మక సమ్మిట్ “From Change to Legacy” (మార్పు నుంచి శాశ్వత వారసత్వం వైపు) అనే ప్రధాన అంశంతో జరగనుంది.

ఈ సమ్మిట్‌లో దేశవ్యాప్తంగా సుమారు 300 కార్పొరేట్ సంస్థలు, 1,200కు పైగా స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు) పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత, సామాజిక అభివృద్ధి, సుస్థిర పురోగతి, సమాజంపై దీర్ఘకాలిక ప్రభావం వంటి కీలక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరగనున్నాయి.

కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, విజయవంతమైన CSR కార్యక్రమాలను ప్రోత్సహించడం, సమాజాభివృద్ధికి కొత్త భాగస్వామ్య అవకాశాలను సృష్టించడం ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సమాజ అభ్యున్నతి కోసం కార్పొరేట్ సంస్థలు , స్వచ్ఛంద సంస్థలు పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక బాధ్యతతో చేపట్టే కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ సమ్మిట్ నిర్వహణను అభినందించారు.

CSR రంగంలో ఈ సమ్మిట్ ఒక మైలురాయిగా నిలిచి, సమాజంలో సుస్థిరమైన మార్పు, శాశ్వతమైన వారసత్వాన్ని సృష్టించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

—