సిద్ధిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్‌ను మలేసియా జైలు నుంచి విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ఖాదర్ భార్య సలీమా బేగం, కుమారుడు సల్మాన్ మంగళవారం హైదరాబాద్ బేగంపేటలోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తమ సమస్యను ఇప్పటికే మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావుకు వివరించినట్టు పేర్కొన్నారు.
సుమారు 11 నెలలుగా ఆమె భర్త మలేసియా జైల్లో ఉన్నారని, ఆయనకు తక్షణ న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) మరియు దౌత్య సహాయం (కాన్సులర్ హెల్ప్) అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సలీమా బేగం కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో ప్రవాసీ ప్రజావాణిని సంప్రదించినట్టు తెలిపారు. ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఈ విషయంపై తమకు మార్గనిర్దేశం చేసినట్టు చెప్పారు.
2018లో ఉపాధి కోసం మలేసియాకు వెళ్లిన ఖాదర్, సహోద్యోగితో జరిగిన ఘర్షణ నేపథ్యంలో అరెస్టై జైల్లోకి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు వివరించారు. ఆయన విడుదల కోసం మలేసియాలోని తెలంగాణ సేవా కార్యకర్త బూరెడ్డి మోహన్ రెడ్డి కౌలాలంపూర్‌లోని ఇండియన్ హైకమీషన్‌తో సమన్వయం కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్, నేషనల్ వర్కర్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధి భార్గవి, బహరేన్‌కు చెందిన తెలంగాణ సోషల్ వర్కర్ నోముల మురళి, తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై శాఖకు చెందిన సెక్షన్ ఆఫీసర్ కంచర్ల శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు రాజీవ్ కుమార్, సమీనా బేగమ్ కుటుంబానికి ధైర్యం చెప్పి సాంత్వన అందించారు.

