▪️ అమెరికాలో అతిపెద్ద తెలంగాణ సంఘం ‘టీటీఏ’
▪️ తెలంగాణలో భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు
▪️ డిసెంబర్ 14న గచ్చిబౌలిలో 10K రన్ – డ్రగ్స్‌పై అవగాహన
▪️ డిసెంబర్ 25న టీటీఏ 10వ వార్షికోత్సవం
▪️ 40కి పైగా సేవా కార్యక్రమాల ప్రణాళిక

హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ సంస్కృతిని సమగ్రంగా సాకారం చేస్తూ, సేవా కార్యక్రమాల్లో అగ్రగామిగా నిలుస్తున్న ‘తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA)’ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “టీటీఏ సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రకటించింది. డిసెంబర్ 9 నుంచి 23 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “Say No To Drugs” థీమ్‌తో నిర్వహించే 10K రన్ ఈ సేవాడేస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిసెంబర్ 25న టీటీఏ తన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది.

హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో టీటీఏ నాయకులు కార్యక్రమాల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఆరోగ్యం, విద్య, యువత అవగాహన, మాదకద్రవ్యాల నివారణ, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలు ఈ ఏడాది నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలోని హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, నల్లగొండ, యాదాద్రి సహా అనేక జిల్లాల్లో టీటీఏ వాలంటీర్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

టీటీఏ సేవాడేస్ 2025 కార్యక్రమాల రూపకల్పనలో ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ చైర్ విజయపాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ళ, సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, వర్సిటీ సేవల డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, సాంస్కృతిక చైర్ డా. వాణి గడ్డం తదితరులు కీలకపాత్ర పోషించారు. అమెరికా నుంచి టీటీఏ నాయకత్వ బృందంతో పాటు తెలంగాణ ప్రాంతీయ ప్రతినిధులు, వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమాల్లో భాగం కానున్నారు.

డ్రగ్స్‌పై అవగాహన – 10K రన్
డిసెంబర్ 14న గచ్చిబౌలిలో నిర్వహించే 10K రన్‌ ద్వారా యువతలో మాదకద్రవ్యాల వినియోగం ప్రమాదాలపై చైతన్యం కల్పించడం లక్ష్యం. విద్యార్థులు, యువత, క్రీడాకారులు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన‌నున్నారు. ఫిట్‌నెస్, ఆరోగ్యం, మరియు డ్రగ్-ఫ్రీ సొసైటీ కోసం సమాజానికి స్పష్టమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

టీటీఏ 10వ వార్షికోత్సవం – డిసెంబర్ 25
2014లో స్థాపించబడిన టీటీఏ, గత దశాబ్ద కాలంగా విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలందిస్తూ అమెరికాలో అతిపెద్ద తెలంగాణ సంఘంగా ఎదిగింది. ఈ ప్రయాణాన్ని స్మరించుకుంటూ, డిసెంబర్ 25న 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. టీటీఏ మరియు తెలంగాణ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతోందని నాయకులు పేర్కొన్నారు.