▪️ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసుల నమోదు
▪️ భాగస్వాములపై చీటింగ్, నమ్మకద్రోహం ఆరోపణలు

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు ఫెయిర్‌మౌంట్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌పై రూ.8.15 కోట్ల రియల్ ఎస్టేట్ మోసం కేసు నమోదు చేశారు. కొంపల్లి ప్రాంతానికి చెందిన కేఆర్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, రామంతాపూర్ గ్రామం, శంకర్‌పల్లి మండలం పరిధిలో సర్వే నం.54(ఈ)లో ఉన్న 3 ఎకరాలు 35 గుంటల భూమిని ఫెయిర్‌మౌంట్ సంస్థ కొనుగోలు చేయడానికి 2024 జనవరి 6న రూ.9.68 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో రూ.1.53 కోట్లు నగదుగా చెల్లించి, రూ.6.50 కోట్లు కొంపల్లిలోని “ఫెయిర్‌మౌంట్ స్క్వేర్”, “ఫెయిర్‌మౌంట్ మిడ్‌టౌన్” ప్రాజెక్టుల్లో కమర్షియల్ యూనిట్లు కేటాయించడం ద్వారా సర్దుబాటు చేయాలని, మిగిలిన రూ.1.65 కోట్లు రెండు నెలల్లో చెల్లించాలని అంగీకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం 2024 ఫిబ్రవరి 1న రిజిస్ట్రేషన్ జరిపి భూమి యాజమాన్యాన్ని ఫెయిర్‌మౌంట్ సంస్థకు బదిలీ చేశారని తెలిపారు. అయితే ఒప్పందం ప్రకారం కమర్షియల్ షాపులను రిజిస్టర్ చేయకపోవడంతో పాటు మిగిలిన బకాయిలను చెల్లించలేదని ఆరోపించారు. పలుమార్లు అడిగినా వివిధ కారణాలు చెబుతూ తప్పించుకున్నారని, 20 నెలలు గడిచినా హామీలు నిలబెట్టుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదేవిధంగా, సంస్థ తరఫున ఒప్పందాలపై సంతకాలు చేసిన వ్యక్తులకు అధికారమేలేదని, కొంతమంది సంతకాలు నకిలీగా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఒప్పందాలను ఉల్లంఘించి మూడో వ్యక్తుల పేర్లపై కమర్షియల్ యూనిట్లకు అగ్రిమెంట్లు చేసారని కూడా ఆరోపించారు. కార్యాలయానికి వెళ్లినప్పుడు బెదిరింపులకు గురిచేసినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

ఈ మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు 28-01-2026న క్రైం నం.4/2026గా కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 316(2), 338, 340(2) r/w 3(5) కింద విచారణ ప్రారంభించారు.

ఈ కేసులో ఫెయిర్‌మౌంట్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ భాగస్వాములు షహజిమ్ హమీద్, సర్ఫరాజ్ హుస్సేన్ అలీ లఖానీ, సాహిల్ నూరాని, ఫరీద్ గిలానీ తదితరులపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.