▪️ మంచి ఫ‌లితాలు చూపిన టీడీఎఫ్‌ ప్రాజెక్టు
▪️ సుస్థిర వరి సాగుకి దిశానిర్దేశం
▪️ మార్గదర్శక ప్రయోగంగా పైలట్ ప్రాజెక్టు

హైదరాబాద్, తెలంగాణ: మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, క్షీణిస్తున్న నేల సారానికి పరిష్కారంగా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF) ఖరీఫ్ 2025 సీజన్‌లో చేపట్టిన ‘పునరుత్పాదక వ్యవసాయ’ (Regenerative Agriculture) పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది.

సిద్దిపేట జిల్లాలోని పెద్దాపూర్, ఇబ్రహీంపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ గ్రామాల్లో 10 మంది రైతులతో, 10 ఎకరాల్లో ఈ ప్రదర్శన ప్లాట్లను ఏర్పాటు చేశారు. టి.డి.ఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ వ్యవసాయ శాఖ, టి.డి.ఎఫ్ జై కిసాన్ విభాగం సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించారు.

ఈ సాగు విధానంలో భాగంగా నేల సారాన్ని పెంచడానికి 19 రకాల పంటల మిశ్రమాన్ని (తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఆకుకూరలు, పచ్చిరొట్ట గింజలు) పండించారు. వీటిని 45-60 రోజుల వద్ద భూమిలో కలియదున్నడం ద్వారా ఎకరానికి దాదాపు 2.3 టన్నుల జీవద్రవ్యం (Biomass) నేలకు చేరింది.

రైతుల‌కు ఈ సాగు విధానం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. నేలలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య 2 నుండి 3 రెట్లు పెరిగింది. నీటి తడుల సంఖ్య 30 నుండి 22కి తగ్గింది (సుమారు 20-25% పొదుపు). రసాయన ఎరువుల వాడకం తగ్గడంతో సాగు ఖర్చు ఎకరానికి ₹4,000 నుండి ₹8,000 వరకు తగ్గింది. రైతు నికర ఆదాయం ఎకరానికి ₹6,000 నుండి ₹12,000 వరకు పెరిగింది.

సాంకేతికతతో కూడిన సాగు (AI & Satellite Advisory)
ఈ ప్రాజెక్ట్‌లో కృషివాస్ స్మార్ట్ అగ్రి సొల్యూషన్స్ సహకారంతో శాటిలైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడారు.

ముందస్తు హెచ్చరికలు: పంటకు పట్టే రోగాలను 7-10 రోజుల ముందే గుర్తించే AI పరికరాలు.
ఖచ్చితమైన పర్యవేక్షణ: 3×3 మీటర్ల గ్రిడ్ స్థాయిలో శాటిలైట్ ద్వారా పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం.
డిజిటల్ అడ్వైజరీ: స్మార్ట్ యాప్ ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సాగు సూచనలు అందజేయడం.

“పెరుగుతున్న రసాయన వాడకాన్ని తగ్గించి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుతూ తక్కువ ఖర్చుతో లాభదాయకమైన వరి సాగును సాధ్యం చేయడమే మా లక్ష్యం,” అని టి.డి.ఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో సి.ఎస్.ఆర్ (CSR) నిధుల, ప్రభుత్వ సహకారంతో ఈ మోడల్‌ను తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని టి.డి.ఎఫ్ యోచిస్తోంది.