అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ ఎంఎన్ఆర్ గుప్త
హైదరాబాద్: జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి కేవలం కలలు కంటే సరిపోదని, వాటిని చేరుకోవడానికి నిర్దిష్టమైన ‘మైక్రో ప్లానింగ్’ (సూక్ష్మ ప్రణాళిక), నిరంతర ‘ఫోకస్డ్ ఎఫర్ట్’ (నిమగ్నమైన శ్రమ) అత్యంత అవసరమని అంతర్జాతీయ కీనోట్ స్పీకర్, విజనరీ లీడర్ ఎంఎన్ఆర్ గుప్త స్పష్టం చేశారు. Bharathi TV Motivational ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన తన 30 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ అనుభవాలను జోడించి, యువత విజయ తీరాలకు చేరడానికి అవసరమైన పలు కీలక సూత్రాలను, సక్సెస్ కరికులమ్‌ను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యమైన అంశాలు వారి మాటల్లోనే…
Work Breakdown Structure
చాలా మంది పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటారు కానీ వాటిని ఎలా సాధించాలో తెలియక సగంలోనే వదిలేస్తుంటారు. ఒక విద్యార్థి నాలుగేళ్ల తర్వాత మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించాలనుకుంటే, ఆ నాలుగేళ్ల దీర్ఘకాలిక లక్ష్యాన్ని వార్షిక, నెలవారీ, వారపు మరియు రోజువారీ లక్ష్యాలుగా (Daily Goals) విభజించుకోవాలి. ప్రతి రోజూ మన ప్రగతిని మనమే ట్రాక్ చేసుకోవాలి. నేను అంతర్జాతీయంగా నిర్వహించిన ₹10,000 కోట్ల ప్రాజెక్టులను కూడా ఇదే మైక్రో ప్లానింగ్ ద్వారా అనుకున్న షెడ్యూల్ కంటే ముందే, బడ్జెట్ లోపలే విజయవంతంగా పూర్తి చేయగలిగాను.
గెలవడం ఎలాగో కాదు.. ‘ఎలా ఓడిపోకూడదో’ ఆలోచించండి:
అపజయం ఎదురైనప్పుడు చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడటం ఆపేసి, అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాం అనే మూల కారణాన్ని (Root Cause) విశ్లేషించి, ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. “ప్రపంచంలో అందరూ ఎలా గెలవాలని ఆలోచిస్తే, నేను మాత్రం ‘ఎలా ఓడిపోకూడదో’ ఆలోచిస్తాను. ఎలా ఓడిపోకూడదో తెలిస్తే, 100% ఆటోమేటిక్‌గా గెలిచే అవకాశం ఉంటుంది” అని గుప్త గారు పేర్కొన్నారు.
విజయాన్ని శాసించే ‘స్ట్రాంగ్ ఫోకస్’
ఫోకస్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు వదలని తత్వం ‘స్ట్రాంగ్ ఫోకస్’ కాగా, పని చేస్తూనే ఇతర వ్యాపకాలతో డిస్ట్రాక్ట్ అవ్వడం ‘వీక్ ఫోకస్’. అసలు ఏ లక్ష్యమూ లేకుండా సమయాన్ని వృథా చేయడం ‘నో ఫోకస్’ కిందకు వస్తుంది. విజేతలకు ఎప్పుడూ స్ట్రాంగ్ ఫోకస్ ఉంటుంది. అలాగే జీవితంలో ఇతరులపై ఆధారపడటం తగ్గించి, 100% సెల్ఫ్ మోటివేషన్ కలిగి ఉండాలి. ఎక్కువ మంది అభిప్రాయాలు తీసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ పెరిగి డీమోటివేట్ అయ్యే ప్రమాదం ఉంది.
గూగుల్ మ్యాప్ లాంటి ‘మెంటర్’ ఉండాలి:
లైఫ్ లో సరైన సమయంలో, సరైన వ్యక్తి నుంచి గైడెన్స్ (Right Guidance) తీసుకోవడమే సక్సెస్ కి ప్రధాన రహస్యం. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి దారి పొడుగునా అందరినీ అడుగుతూ వెళ్తే తప్పుదారి పట్టే అవకాశం ఉంది, అదే గూగుల్ మ్యాప్ (రంగాల నిపుణుడు) ని నమ్మితే 100% సక్సెస్ ఫుల్ గా చేరుకుంటాం. సచిన్ టెండూల్కర్‌కు రమాకాంత్ అచ్రేకర్ లాగా ప్రతి ఒక్కరికీ లైఫ్ లో ఒక మంచి మెంటర్ అవసరం. లక్ష్యాలు లేని నెగిటివ్ వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం తెలివి ఉంటే సరిపోదు, దాంతో పాటు ప్రాక్టికల్ థింకింగ్, అనుభవం అవసరం. ప్రస్తుతం డిమాండ్ ఉన్న రంగాల కంటే, రాబోయే 10-20 ఏళ్లలో ఏ రంగానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయో గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకుని లాజికల్ గా అడుగులు వేయాలి. “నేను పర్ఫెక్ట్ లీడర్ ని అని చెప్పను, కానీ నిరంతరం నేర్చుకుంటూ పర్ఫెక్ట్ గా ఉండటానికి ప్రయత్నించే లైఫ్ లాంగ్ లెర్నర్ను” అని ఎంఎన్ఆర్ గుప్త యువతకు పిలుపునిచ్చారు.


