• జ్ఞానం నిత్యం నేర్చుకోదగిన, తెలుసుకోదగిన ప్రక్రియ !
  • (Knowledge is an ever learning and ever understanding process)
  • వివేకం నిరంతరం అన్వేషిస్తూ ఆచరించదగిన సత్ క్రియ !!
  • (Wisdom is an ever explorable and ever practising product)

సకల చరాచర సృష్టిలో మానవుడు మిగతా జీవులన్నింటిపైనా ఆధిపత్యం వహిస్తూ ప్రపంచాన్ని శాసించే స్థితికి రావడం వెనక ఉన్న ఒకే ఒక్క కారణం – “జ్ఞానం”! మనిషిలో సహజంగా క్రమానుగతంగా రూపొందిన జ్ఞానము, విజ్ఞానాల అన్వేషణలే ఈ అనూహ్య పురోగతిలో కీలక భూమిక పోషించాయని చెప్పవచ్చు.
అదే సమయంలో కాలం, సమయం, భూ భ్రమణ – పరిభ్రమణల ఫలితంగా రూపొందే రుతువులు, ప్రపంచ గమనాలు అన్నీ ఎప్పటికప్పుడు మనిషి జ్ఞానాన్ని దశలవారీగా గుర్తించడానికి, దాన్ని మరింత విస్తరింపచేయడానికి, మనిషి సాధించిన విజ్ఞానపు సంచయాన్ని సుసంపన్నం చేయడానికి దోహదపడతాయి. అందుకే జ్ఞానవిజ్ఞాన పరంపరని కాలం, సమయం ఆధారంగా నిర్ధారించే పరిస్థితి అమలులోకి వచ్చింది.

కాలాన్ని గణించడం కనుక్కున్న తర్వాత సంవత్సరానికి 365 రోజులుగా, 12 మాసాలుగా, మాసానికి 30 రోజులుగా, రోజుకు 24 గంటలుగా గమనించి తన పరిణామ ప్రాకృతిక వికాసాన్ని గుర్తించే స్థితికి మానవుడు ఎదిగాక, గడుస్తున్న ప్రతిరోజు ఎన్నో అభ్యసనాలు, యత్న – దోషాలు, అనుభవాలు, జ్ఞాన, విజ్ఞానాల సంకలనంగా రూపొందుతూ వచ్చింది. ఆ క్రమంలోనే భారతీయ పంచాంగ నిపుణులు, ఖగోళ శాస్త్రవేత్తలు 60 ఏళ్ల చక్రీయ గమనంతో కూడిన కాలమానాన్ని గమనించి, ప్రతి సంవత్సరానికి ఒక నిర్దిష్ట లక్షణాలను ఆపాదించి, ఆ క్రమంలోనే వాటికి ప్రభవ, విభవ, ప్రమోదూత వంటి పేర్లు పెట్టారు.
ఇవన్నీ ఒకవైపు అయితే ప్రపంచ, స్థానిక, జాతీయ రంగాలలో జరిగే పరిణామాలు సంవత్సర కాలపు ప్రాతిపదికన అందరికీ ఒక గుణ పాఠాలుగా చెప్పవచ్చు. ఆ లెక్కన ఒక సంవత్సర కాలం వివిధ సంఘటనలు, సన్నివేశాల సమాహారం అని భావించవచ్చు.

అనంత కాల ప్రవాహంలోని గమనాన్ని ఒక సంవత్సరం ప్రాతిపదికగా ఒడిసి పట్టడం, రికార్డు చేయడం, వివరించడం, విశ్లేషించడం అంటే “కాలంలోని ఒక ముక్క” (Fragment of Time)ను స్థిరీకరించడమే! “కాలం అనే ప్రయోగశాలలో వివిధ మానవులు చేస్తున్న పనులు, కార్యాలు, ఫలితాలను నమోదు చేయడమే !” అంటే ఒక సంవత్సరం అనేది ఒక కాల పరిమితిలో మానవ జాతి యావత్తు నిర్వహించిన మొత్తం కార్యకలాపాల ప్రయోగ శాల అన్నమాట!

అలా కాల చక్రంలో ఏదో ఒక సంవత్సరాన్ని ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని, దానికి ముందు ఉండే పరిస్థితులు, మనం ప్రమాణంగా తీసుకున్న సంవత్సరానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రిక, సాంకేతిక, వైజ్ఞానిక, పాలనాపరమైన ఎన్నో అంశాల పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రామాణిక సంవత్సరంలోని సంఘటనలు రాబోయే సంవత్సరపు పరిణామాలకు కారణం కావడం లేదా మార్గదర్శనం చేస్తాయి. ఇదొక నిరంతర సమయ స్రవంతి.

ఈ విషయాలన్నింటినీ సాకల్యంగా గమనించారు గనకే అన్ని పోటీ పరీక్షలలో అభ్యర్థుల జ్ఞాన, విజ్ఞాన, వివేక, వివేచన అంశాలను పరీక్షించడానికి “కరెంట్ అఫైర్స్” పేరిట సమకాలీన వార్త, విశేషాలు, విశ్లేషణలను అభ్యర్థి జ్ఞానాన్ని పరీక్షించే కొలమానాలుగా గుర్తించారు. ఆ మేరకు ప్రతీ పరీక్షలో అంటే బిఎస్ఆర్బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, గ్రూప్ వన్, టూ, త్రీ, ఫోర్… ఇలా ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీపరీక్షల్లో నైనా అభ్యర్థికి సమకాలీన వార్త, విశేషాలు, సంఘటనల పట్ల తనకు ఉండే జ్ఞానాన్ని పరీక్షించటం అనేది ప్రాతిపదికగా చేసుకున్నారు. అందుకే ప్రతీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కనీసం 15 నుంచి 25 శాతం ప్రశ్నలు ఈ సమకాలీన అంశాల నేపథ్యంలో నుంచే అడుగుతూ ఉంటున్నారు.

అయితే ఒక సంవత్సర కాలంలో జరిగిన వివిధ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక, పాలనాపరమైన, సాంకేతిక, వైజ్ఞానిక వార్తలు విశేషాలు అన్నిటినీ అభ్యర్థి సమకూర్చుకోవడం కొంచెం కష్టసాధ్యమైన పని. అందుకే ఒక సంవత్సర కాలంలో జరిగిన అన్ని అంశాలను ఒకే చోట సంకలనం చేసి సంఘటనల సమాహారంగా విషయ విశ్లేషణ ప్రాతిపదికగా సమకూర్చే సంప్రదాయానికి మేధావులు, వార్త పత్రికలు, జర్నలిస్టులు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలో TIME, NEWS WEEK, భారతదేశంలో FRONTLINE, The WEEK, INDIA TO- DAY, STATESMAN లాంటి పత్రికలు, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన మ్యాగజైన్లు ప్రతి డిసెంబర్, జనవరి నెలలలో ప్రత్యేక సంచికలుగానో, Publications Division వంటి ప్రభుత్వ అధికారిక సంస్థలు, ఏటా Year Books పేరిట సమగ్రంగానో పుస్తకాలను ప్రచురిస్తూ వస్తున్నాయి. వీటన్నింటి ప్రధాన ఉ ద్దేశం అభ్యర్థిని సమకాలీన పరిస్థితులు, సంఘటనలపట్ల అవగాహన కల్పించడం మాత్రమే కాక, రాబోయే పరీక్షలలో కరెంట్ అఫైర్పై వచ్చే ప్రశ్నలను సోదాహరణంగా అందిస్తూ అభ్యర్థిని సన్నద్ధం చేయడమే!

అందుకే తెలంగాణా బి.సి ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి & శిక్షణా కేంద్రం (బిసి స్టడీ సర్కిల్) తొలిసారిగా “వార్షిక – 2025” పేరుతో ఇయర్ బుక్ని ప్రచురించే ప్రయత్నం చేస్తున్నది. ఇది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కరదీపికగా ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అందుకే ఈ పుస్తకాన్ని ప్రధానంగా రెండు రకాల జ్ఞానపరమైన అంశాలను క్రోడీకరించి రూపొందించాం.

1) సమకాలీన జ్ఞానం (Current Knowledge): ఇది సమకాలీనంగా ఒక సంవత్సర కాలంలో ఎప్పటికప్పుడు సంభవించిన సంఘటనలూ, సన్నివేశాలూ, ఆవిష్కరణలు ఆధారంగా పూర్వ జ్ఞానాని (previously acquired knowledge) కి కొనసాగింపుగా ఉంటుంది.

2) నిర్దిష్ట జ్ఞానం (Concrete Knowledge): ఈ జ్ఞానం కాలాతీతంగా, మార్పులేవీ లేని ఒక ప్రాథమిక ప్రాతిపదిక జ్ఞానం (Primary Basic Foundational knowledge) గా ఉంటుంది.
అయితే ఈ రెండు కలిస్తేనే సంపూర్ణ జ్ఞానం (complete knowledge) అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఆవిష్కరణ సమకాలీనమే అయి ఉండొచ్చు. కానీ అది గతంలో జరిగిన ఆవిష్కరణలకు కొనసాగింపుగా, చేర్పుగా ఉంటుంది. ఆ శాస్త్ర జ్ఞానాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది. మానవుడి విజ్ఞాన స్థాయిని మరింత పెంచుతుంది. అందుకే మనిషిలో జ్ఞానం 360 డిగ్రీల స్థాయిలో విస్తరణ జరగాలంటే, ప్రాధమిక ప్రాతిపదికగా ఉండే 180 డిగ్రీల జ్ఞానం ఒకవైపు అయితే, ఏ ఏటికాయేడు సంభవించే సమకాలీన జ్ఞానం మరో 180 డిగ్రీలుగా ఉంటుంది. నిజానికి పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలన్నీ ఈ రెండు అంశాల మేళవింపుగానే ఉంటాయి.

ఈ రెండింటినీ గమనించి ఈ “వార్షిక -2025లో 2025 సంవత్సరం మొత్తం మీద నెలల వారీగా జరిగిన వివిధ జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర పరమైన సందర్భాలను, సన్నివేశాలను, సంఘటనలను విశ్లేషించడం, వివరించడం మాత్రమే కాకుండా, ఆయా శాస్త్రాలకు సంబంధించి ముఖ్యంగా చరిత్ర, భూగోళ శాస్త్రం, భారత రాజ్యాంగం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఆర్థికశాస్త్రం, క్రీడలు, సాధారణ ప్రాపంచిక పరిజ్ఞానం వంటి అంశాల పైన కూడా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది.

ఇక నాకు అర్థమైనంత మేరకు పోటీ పరీక్షలలో Current Affairs అంటే ఒక సంవత్సర కాలానికి సంబంధించిన ఈ క్రింది అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 1) వార్తలు (News), 2) తేదీలు (dates), 3) ఘటనలు (events), 4) సంఘటనలు (incidents), 5) సందర్భాలు (occasions), 6) పరిణామాలు (Developments), 7) ప్రదేశాలు (places), 8) వ్యక్తులు (persons), 9) పురస్కారాలు (Awards), 10) సాధనలు ( Achievements), 11) గుర్తింపులు ( Recognitions), 12) సూచికలు (Indices), 13) నివేదికలు (reports) మొదలైనవి. అందుకే ఈ “వార్షిక -2025” లో వీటన్నిటిని అధ్యాయాలు, అంశాల వారీగా కూర్చాము. వీటికి తోడు, పోటీ పరీక్షలలో అడిగే పాఠ్యాంశాలకు సంబంధించిన “ప్రాథమిక ప్రాతిపదిక జ్ఞానాన్ని” ఇవ్వగలిగే సమాచారాన్ని కూడా ఈ పుస్తకంలో క్రోడీకరించడం విశేషం.
అలా ఈ పుస్తకం 2025వ సంవత్సరపు పాక్షిక డాక్యుమెంటేషన్గా నేను భావిస్తాను. అందుకే ఈ పుస్తకం కేవలం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు మాత్రమే కాకుండా వివిధ అంశాలపై ఆసక్తి ఉన్న పరిశోధకులకు, సామాజిక కార్యకర్తలకు, మేధో బుద్ధి జీవులకు, జర్నలిస్టులకు ఒక కరదీపికగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తాను.

అలాగే TGPSC త్వరలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉద్యోగాల రిక్రూట్మెంట్ నేపథ్యంలో “భారతీయ హైందవ విజ్ఞానం” పేరిట ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చడం ఈ పుస్తకంలో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. ఇలాంటి కంటెంట్ ను కూడా ప్రధాన స్రవంతి Year Bookలో భాగంగా రూపొందించిన తొలి గ్రంథంగా ఈ పుస్తకం అపూర్వమైన సాధించగలదని భావిస్తున్నాను.

ఇక బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే ఈ “వార్షిక – 2025” తీసుకురావాలనే పనికి పూనుకొని తక్షణమే కార్య రూపం ఇస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఇది ఇంకా మరింత సమగ్రంగా (Comprehensive), సంపూర్ణంగా (Complete) తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. రాబోయే సంవత్సరాలలో ఈ “వార్షిక” సీరీస్ లో రాబోయే పుస్తకాలను మరింత లోతుగా, విశ్లేషణాత్మకంగా, విశదంగా (Detailed in-depth analysis) అందించే ప్రయత్నం చేస్తాం.

అలాగే ఈ ‘వార్షిక -2025’ రచనకుగాను 2025 సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రధాన, దిన, వార, మాసపత్రికలను, తెలుగు-ఇంగ్లీషు పత్రికలను పోటీపరీక్షలకు సంబంధించిన ప్రత్యేక పత్రికలను మాత్రమేకాక వివిధ శాస్త్రాలకు సంబంధించిన ప్రామాణిక గ్రంథాలను, ఎన్సైక్లోపీడియా, వికీపీడియా, ఇతర రిఫరెన్స్ గ్రంథాలను కూడా సంప్రదించాం. వారందరికీ కృతజ్ఞతలు. కాగా ఈ పుస్తక రచనలో యుద్ధప్రాతిపదికన రేయింబవళ్ళు కష్టపడ్డ భాస్కర్ గుప్తా, ఆదిత్య పకిడే, భవాని ఔతు ..ఇతర రచయితలకీ నా ధన్యవాదాలు!

అలాగే ఇటీవల సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గుడెల్లి సృజన (AIR 52), తరుణ్ తేజ (AIR 123), దైనంపల్లి ప్రవీణ్ (AIR 793), తెలంగాణ రాష్ట్రంలో తొట్టతొలి గ్రూప్-1 పరీక్షలలో ఎంపికైన ప్రతిభా శేఖర్ (డిప్యూటీ కలెక్టర్), వికాస్ ముల్ల (అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్), భార్గవ్ మ్యాక (అసిస్టెంట్ లేబర్ కమిషనర్) తమ సలహాలు సూచనలతో ఈ పుస్తక రచనలో ఎంతగానో సహకరించారు. వారికి కృతజ్ఞతలు!!

ఇక బిసి స్టడీ సర్కిల్ ప్రధాన లక్ష్యం – “పోటీ పరీక్షలలో పాల్గొని భవిష్యత్ అధికారులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపిక కావాలనుకునే ఔత్సాహిక యువతీ యువకులకు కావాల్సిన జ్ఞానాన్ని, నైపుణ్యాలను అందచేయడమే”! ఈ లక్ష్య సాధనలో నాకు నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తున్న శ్రీమతి బాల మాయా దేవి, ఐఏఎస్, కమిషనర్, బిసి వెల్ఫేర్ గారికి, నాకు అండగా నిలుస్తున్న బి.సి. సంక్షేమ శాఖ అధికారులు సైదులు, IFS గారికి, అలోక్ కుమార్ గారికి, మల్లయ్య భట్టు గారికి ధన్యవాదాలు!!

నాకు నిరంతర ఉత్సాహ ప్రోత్సాహలు అందిస్తూ, నన్ను ముందుకు నడిపిస్తున్న గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారికి, ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక అభివాదాలు!!!

  • డాక్టర్ మామిడి హరికృష్ణ, డైరెక్టర్,
    తెలంగాణ బి.సి. ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి & శిక్షణా కేంద్రం,
    సంక్షేమ భవన్, హైదరాబాద్.