మల్లాపూర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించకుండా ప్రభుత్వం నామినేటెడ్ విధానంలో పాలక వర్గాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ పలువురు రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఈ రోజు నిర్వహించిన ప్రెస్మీట్లో వారు వెల్లడించారు.
రైతుల సహకారంతో, ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా నిర్వహించగలిగే PACS ఎన్నికలను జరపకుండా క్యాబినెట్ స్థాయిలో నామినేషన్ల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలను నియమించాలనే నిర్ణయం తీసుకోవడం రైతాంగాన్ని మోసం చేయడమేనని నాయకులు పేర్కొన్నారు. ఇది రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమని విమర్శించారు.
ఇప్పటికే రైతుబంధు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, ఋణమాఫీ నిలిచిపోవడం, వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వంటి అంశాలపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం అన్యాయమని తెలిపారు.
ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం. 597 ద్వారా అధికారులను “పర్సన్ ఇన్చార్జ్”లుగా నియమించిన నిర్ణయంపై కోర్టు స్టే ఇచ్చినప్పటికీ, వారినే కొనసాగించడం కోర్టు ధిక్కరణకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో కోఆపరేటివ్ కమిషనర్ 10 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేసి పాత చైర్మన్లను కొనసాగించాలని కోర్టు సూచించినట్లు తెలిపారు.
మే 1, 2026న హైకోర్టులో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో, స్వామినాథన్ కమిషన్ సూచనలు, నాబార్డ్, కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన అవగాహన ఒప్పందాల ప్రకారం గడువు ముగిసిన సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. సహకార సంఘాల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.
రైతుల ప్రయోజనాలను కాపాడే దిశగా తక్షణమే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.
ఈ ప్రెస్మీట్లో మల్లాపూర్ గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, చిట్టాపూర్ సహకార సంఘ మాజీ అధ్యక్షులు నేరెళ్ల మోహన్ రెడ్డి, సిర్పూర్ సహకార సంఘ అధ్యక్షులు మాజీ బద్దం అంజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి లింగస్వామి, ముద్దం శరత్, పెద్దిరెడ్డి లక్ష్మణ్, డబ్బా రమేష్ రెడ్డి, ఎ. ముత్యంరెడ్డి, బి. లక్ష్మీకాంతరావు, ఎన్. రాజేశ్వర్, రాజలింగం, యు. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

