▪️ సిరిసిల్ల అప్పారెల్ పార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక‌లు
▪️ మహిళలకు స్వయం ఉపాధి దిశగా టీడీఎఫ్ వనిత చేయుత‌ కార్యక్రమాలు
▪️ సిరిసిల్లలో మహిళలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు
▪️ మహిళలు స్వావలంబన దిశగా ముందుకు రావాలి: కలెక్టర్ గరిమ అగర్వాల్
▪️ టీడీఎఫ్ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్ యంత్రాలు, సర్టిఫికెట్లు పంపిణీ
▪️ సిరిసిల్లలో చేనేత, కళారంగ మహిళలకు సత్కారం

సిరిసిల్ల: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) వనిత చేయుత ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాలోని అప్పారెల్ పార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గీత, సిరిసిల్ల అప్పారెల్ పార్క్ ఏడి సంతోష్, టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, టీడీఎఫ్ వనిత చేత అధ్యక్షురాలు టి. వాణి, టీడీఎఫ్ జనరల్ సెక్రటరీ వినీల్, టెక్సపోర్ట్ కంపెనీ రీజినల్ హెచ్‌ఆర్ సాగర్, లోకల్ హెచ్‌ఆర్ మధుకర్, సమర్థ ట్రైనర్ సునీత తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

డీఆర్‌డీఏ సహకారంతో ముస్తాబాద్ మండలంలోని తొమ్మిది గ్రామాల నుంచి ఎంపిక చేసిన మహిళలకు పంచువేట్ టెక్స్టైల్ పార్క్‌లో ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల అప్పారెల్ పార్క్‌లోని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణ కేంద్రంలో మహిళలకు ట్రైనింగ్ ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని, ప్రభుత్వం, ఇతర సంస్థలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసం మహిళలు కూడా ఉద్యోగాలు లేదా వ్యాపార రంగంలో ముందుకు రావాలని ఆమె పేర్కొన్నారు.

సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.

టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 25 సంవత్సరాలుగా టీడీఎఫ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా వనిత చేయుత ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల ప్రాంతంలో మహిళలు ఎక్కువగా బీడీ పరిశ్రమ, వ్య‌వ‌సాయ రంగంపై ఆధారపడుతున్నారని, బీడీ చుట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా ముస్తాబాద్ మండలంలో కుట్టుమిషన్ శిక్షణ ఇచ్చి ఉచిత కుట్టుమిషన్లు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే అప్పారెల్ పార్క్‌లోని కంపెనీల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు.

పంచువేట్ కంపెనీలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై కంపెనీ హెచ్‌ఆర్ మధుకర్, సీనియర్ విపి హెచ్‌ఆర్ సాగర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆసక్తి ఉన్న మహిళలకు కంపెనీ ద్వారా శిక్షణ అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను టీడీఎఫ్ సత్కరించింది. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన చేనేత కార్మికురాలు రేఖను జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఆమె మూడు నెలల పాటు కష్టపడి తయారు చేసిన “నారీ శక్తి” చేనేత చీర అందరినీ ఆకట్టుకుంది. అలాగే బాటిక్ కళాకారిణి యాసాల మమతను కూడా కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించారు. ఆమె యువతకు బాటిక్ ఆర్ట్‌పై శిక్షణ ఇచ్చి ఈ కళను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.