ఎల్లికాట్ సిటీ (బ్రేకింగ్ నౌ): అమెరికాలోని తెలుగు సమాజానికి ప్రతిష్ఠాత్మక వేదికగా నిలిచే 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ సన్నాహాలపై ప్లానింగ్ టీమ్ మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎల్లికాట్ సిటీలో కీలక సమావేశం నిర్వహించింది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ మహాసభలను అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ ఇంటరాక్టివ్ సమావేశంలో డెలావేర్, మేరీల్యాండ్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా రాష్ట్రాల నుండి సుమారు 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మహాసభల నిర్వహణలో కీలకమైన దాదాపు 70 కమిటీల బాధ్యతలు, సమన్వయ విధానం, అమలు కాలక్రమం వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించారు. కాన్ఫరెన్స్ కోర్ కమిటీ సభ్యులు ఈ సమావేశాన్ని సమర్థంగా నిర్వహించారు.

కమిటీల నియామకాలపై చైర్‌లు, కో-చైర్‌లు, సభ్యులతో కూడిన డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శించి, ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. కమిటీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, పనుల అమలులో వేగం, సమర్థతను పెంచడం వంటి అంశాలపై చర్చలు సాగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు ఈ సమావేశం జరగడం విశేషం. మహిళా నాయకులు, వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని తమ నిబద్ధతను ప్రదర్శించారు.

ఈ మహాసభల నిర్వహణకు అడ్వైజరీ, అవార్డ్స్, బ్యాంక్వెట్, బడ్జెట్, బిజినెస్ అండ్ స్టార్టప్స్, సిఎంఇ & హెల్త్, కార్పొరేట్ స్పాన్సర్‌షిప్, కల్చరల్, డెకరేషన్, ఫైనాన్స్, ఫిల్మ్ అండ్ ఫోటోగ్రఫీ, ఫుడ్, హాస్పిటాలిటీ, లిటరరీ, ఇమ్మిగ్రేషన్, ఎన్నారై, పొలిటికల్, స్పోర్ట్స్, ట్రాన్స్‌పోర్టేషన్, వెన్యూ, ఉమెన్, యూత్ వంటి పలు కీలక కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ATA ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కోఆర్డినేటర్ రవి చల్లా, డైరెక్టర్ సుధీర్ దామిడి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్, కాన్ఫరెన్స్ ఏరియా కోఆర్డినేటర్ తిరుమల్ మునుకుంట్ల, కో-నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్ సామ, కో-డైరెక్టర్ కిరణ్ అల తదితరులతో పాటు ట్రస్టీలు శ్రీనివాస్ దార్గుల (బడ్జెట్ చైర్), సంతోష్ రెడ్డి (అవార్డ్స్ చైర్) పాల్గొన్నారు.

సమావేశ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించిన స్థానిక నిర్వాహకులు రాజీ రెడ్డి, కృష్ణ రెడ్డి, ఇతర వాలంటీర్లకు నిర్వాహక బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.