▪️ ఆరు అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ
▪️ వందలాది మంది తెలుగు కుటుంబాల సందడి..
▪️ కోలాటాలు, బతుకమ్మ పాటలతో ఉత్సాహం

సియాటిల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెబుతూ అమెరికాలోని సియాటిల్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వందలాది మంది తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని, ఆటపాటలతో సందడి చేశారు.

ఈ వేడుకల్లో ఆరు అడుగుల ఎత్తులో తాజా రంగురంగుల పూలతో కళాత్మకంగా పేర్చిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందంగా అలంకరించిన అమ్మవారి ప్రతిమ వేడుకలకు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పూజలు నిర్వహించి కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం చిన్నారులు, యువతీ యువకులు, మహిళలు ప్రదర్శించిన కోలాటాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్తమ బతుకమ్మ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు వివిధ రకాల పూలతో సృజనాత్మకంగా, కళాత్మకంగా బతుకమ్మలను రూపొందించారు. ఒక్కో బతుకమ్మ మరోదానితో పోటీపడేలా అందంగా ఉండటంతో విజేతలను ఎంపిక చేయడం నిర్వాహకులకు సవాలుగా మారింది.

ఈ వేడుకలను విజయవంతం చేయడంలో టీడీఎఫ్ సియాటిల్ బృందం, వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. టీడీఎఫ్ ముఖ్య సభ్యులు విక్రమ్ గార్లపాటి, రాహుల్ సూర్యోదయ్, అర్చనా నామిలకొండ కార్యక్రమ నిర్వహణలో విశేష కృషి చేశారు. అర్చనా నామిలకొండ ప్రస్తుతం టీడీఎఫ్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, ప్రవాస తెలుగు ప్రజల మధ్య ఐక్యత, సాంస్కృతిక అనుబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొనడంతో సియాటిల్‌లో బతుకమ్మ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి.