▪️జీబీఎన్ ఎలైట్ సొసైటీ ఆధ్వర్యంలో సంతాప సభ..

హైదరాబాద్: ప్రముఖ కళాకారుడు, మిమిక్రీ, మ్యాజిక్, వెంట్రిలాక్విజం ప్రదర్శనలతో వేలాది మంది ప్రేక్షకులను అలరించిన స్వర్గీయ అరుకుల సత్యనారాయణ గౌడ్‌కు జీబీఎన్ ఎలైట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సంతాప సభలో పలువురు కళాకారులు, మిత్రులు, అభిమానులు పాల్గొని ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 40 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందిన సత్యనారాయణ గౌడ్ తన 15 ఏళ్లకు పైగా కళా ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మిమిక్రీ, మ్యాజిక్, వెంట్రిలాక్విజం వంటి విభిన్న కళారూపాల్లో ప్రతిభ చాటుతూ రెండు వేలకు పైగా వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. తన హాస్య చతురతతో, వినూత్న ప్రదర్శనలతో వేలాది మంది ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు పూయించారు.

ఇటీవల హకీంపేటలో బతుకమ్మ వేడుకల్లో కళా ప్రదర్శన ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృత్యువాత పడ్డారు. ఆయన ఆకస్మిక మరణం కళారంగానికి, స్నేహితులకు, అభిమానులకు తీరని లోటుగా మిగిలింది.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సత్యనారాయణ గౌడ్ కేవలం గొప్ప కళాకారుడే కాకుండా అందరినీ నవ్విస్తూ, ఆప్యాయంగా పలకరించే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. వేదికపై తన ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఆయన, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆయనతో కలిసి గడిపిన క్షణాలను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

జీబీఎన్ ఎలైట్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. సత్యనారాయణ గౌడ్ అందించిన కళా సేవలు, ఆయన పంచిన నవ్వులు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, కళాకారుడిగా సంపాదించుకున్న కీర్తి, అభిమానుల హృదయాల్లో ఆయనకు ఉన్న స్థానం చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు స్వర్గీయ అరుకుల సత్యనారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
నవ్వులు పంచిన కళాకారుడు భౌతికంగా దూరమైనా.. ఆయన కళా జ్ఞాపకాలు, ఆప్యాయతలు ఎప్పటికీ తమ హృదయాల్లో నిలిచిపోతాయని ఈ సందర్భంగా పలువురు భావోద్వేగంగా పేర్కొన్నారు. సత్యనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులకు జీబీఎన్ ఎలైట్ సొసైటీ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు.

కార్యక్రమంలో జీబీఎన్ ఎలైట్ సొసైటీ నాయకులు ర్యాకల లక్ష్మి నారాయణ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ ముద్దం, పల్లె సాయి చరణ్ గౌడ్, శివకుమార్ గౌడ్, మట్ట రాజు గౌడ్, మధుసూదన్ గౌడ్, మలుగురు శేఖర్ గౌడ్, ముత్యం శ్రీనివాస్ గౌడ్, అములకొండ శ్రీనివాస్ గౌడ్, వంగాల బాలరాజ్ గౌడ్, అంబటి రాజేందర్ గౌడ్, పెద్ది శంకర్ గౌడ్, బుర్ర సాయి కుమార్, రవిందర్ గౌడ్, జీబీఎన్ ఎలైట్ సొసైటీ అడ్వైజర్ ముద్దగౌని రామ్ మోహన్ గౌడ్, ఎరుపల్లి శర్ముఖ రావు, సత్యనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులు పంజాల కాటం, ఎల్లంకి వెంకటేశ్వర్లు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.