హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల కేటాయింపులో గ్రూప్–1 కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ విధానాన్ని తక్షణమే సవరించి గ్రూప్–1 కులాలకు రెండో రోస్టర్ పాయింట్ కేటాయించాలని 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు మేధావులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
దక్షిణ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అమలులో సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రూప్–1 కులాలకు రెండో రోస్టర్ పాయింట్, గ్రూప్–3 కులాలకు 16వ రోస్టర్ పాయింట్ కేటాయించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో దళిత మంత్రులు బాధ్యత తీసుకొని రోస్టర్ పాయింట్ల కేటాయింపులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అగ్రవర్ణ పేదల జేఏసీ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 57 ఎంబీఎస్సీ కులాలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలోనూ ప్రభుత్వం వివక్ష చూపడం దారుణమని అన్నారు. ఆయా కులాలకు న్యాయం జరిగే వరకు తమ మద్దతు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలతో పాటు 57 కులాలకు కూడా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. రోస్టర్ విధానాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేయాలని, ఎస్సీ ఉపకులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, పీసీసీ మహిళా నాయకురాలు జీవనజ్యోతి తదితరులు ఈ డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పరిరక్షణకు చేపట్టే పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు.
ఈ సమావేశంలో 57 ఎంబీఎస్సీ కులాల నాయకులు ఉపదే సనధన్, కర్నె రామారావు, బత్తుల పాండు, మన్నె సుధాకర్, శాఖమూరి యాదగిరి, కురువ బాలరాజు, మఠపతి నాగయ్య స్వామి, అంతోని సురేష్, గడ్డం విష్ణు, కొలుపుల రాఘవులు, దుర్గం నగేష్, బొబ్బిలి రమేష్, రాజేందర్, కొండ్లేపు అర్జున్, గడ్డం చిరంజీవి, వేణు మాష్టి తదితరులు పాల్గొన్నారు.

