• జగిత్యాల మెట్‌పల్లిలో హనీట్రాప్ ముఠా గుట్టురట్టు
  • రౌడీ షీటర్ రాజుతోపాటు ఇద్దరు అరెస్ట్

మెట్‌ప‌ల్లి (Ilyas):
ముద్దుముద్దు మాటలతో వల వేసి.. ఏకాంతంలోకి దింపి.. నగ్న చిత్రాలు, వీడియోలు బంధించి లక్షల రూపాయలు వసూలు చేసే హనీ ట్రాప్ దందాను మెట్‌పల్లి పోలీసులు చేధించారు. గత కొంతకాలంగా అమాయకులు, ముఖ్యంగా ధనవంతులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దందాకు నాయకత్వం వహిస్తున్న కోరుట్ల రౌడీ షీటర్ రాజు కుమార్ అలియాస్ రాజుతోపాటు ఇద్దరు అరెస్టయ్యారు. మొత్తం నలుగురు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేశారు.

ఎలా పని చేసేది ఈ ముఠా?
సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో రౌడీ షీటర్ రాజు, భర్తకు దూరంగా ఉంటున్న బలుమూరి స్వప్నతో చేతులు కలిపాడు. వీరిద్దరికి బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్, మాగని దేవా నర్సయ్యలు జతకలిసి ముఠా ఏర్పరిచారు. హనుమాన్ నగర్‌లో గది అద్దెకు తీసుకుని, మహిళల పట్ల బలహీనత ఉన్న ధనవంతుల ఫోన్ నంబర్లు సేకరించి స్వప్న వారితో ఫోన్‌లో కవ్వింపుగా మాట్లాడి ఆ గదికి రప్పించేది. లోపలికి వచ్చిన బాధితుడు నగ్నంగా ఉన్న సమయంలో ముఠా సభ్యులు ఒక్కసారిగా ప్రవేశించి వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తామని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేశారు. విచారణలో ఇటువంటి ఘటనలు పలుమార్లు జరిగినట్లు తేలింది.

వ్యాపారి ధైర్యంతో ముఠా కూలింది
మూడు నెలల క్రితం మెట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారిని టార్గెట్ చేసిన ముఠా, డిసెంబర్ 28న అదే పద్ధతిలో నగ్న వీడియోలు తీసి, బయటపెడతామంటూ రూ. 10 లక్షలు డిమాండ్ చేసింది. అంతేకాక ప్రాణహానీ బెదిరింపులు కూడా ఇచ్చింది. బాధితుడు ధైర్యం చేసి పోలీసులు ఆశ్రయించడంతో కేసు నమోదు అయింది. అచ్చం అదే ఫార్మాట్‌లో దర్యాప్తు జరిపిన పోలీసులు ముఠా కార్యకలాపాలను నిఘా ఉంచి, కీలక ఆధారాలు సేకరించి ముగ్గురిని అరెస్టు చేశారు.

పోలీసుల హెచ్చరిక
పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం సెర్చ్ ఆపరేషన్స్ వేగవంతం చేశారు. ఇటువంటి మోసపూరిత బ్లాక్ మెయిల్‌ ఘటనలు ఎదురైతే ప్రజలు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని మెట్‌పల్లి సిఐ వి. అనిల్ కుమార్ సూచించారు. అపరిచిత మహిళలతో ఫోన్ కాల్స్, చాటింగ్, సోషల్ మీడియా సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

స్థానికుల స్పందన
ఈ ఘటన మెట్‌పల్లిలో కలకలం రేపింది. ఇలాంటి నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటం శుభపరిణామమని స్థానికులు అభిప్రాయపడ్డారు.