హైదరాబాద్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి దళితుల్లో అత్యంత వెనుకబడిన 57 ఎంబీఎస్సీ కులాల అభ్యర్థులకు మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్ పదవుల టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్ని నియోజకవర్గాల ఇంచార్జ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 57 ఎంబీఎస్సీ కులాలు సంపూర్ణ మద్దతు తెలిపాయని, పార్టీ విజయానికి కీలకంగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ప్రభుత్వానికి మద్దతుగా 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి గణనీయంగా కృషి చేసిందన్నారు.

సర్వేల పేరుతో మళ్లీ ఆర్థికంగా బలమైనవారికే టికెట్లు కేటాయిస్తే తమ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అలాంటి పరిస్థితులను సహించబోమని హెచ్చరించారు. దళితులకు కేటాయించే స్థానాల్లో కనీసం 30 శాతం కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ పదవులు ఎస్సీ ఉపకులాలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి నాయకులు ఉపదే సనాధన్, బత్తుల పాండు, బొబ్బిలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.