- 50 ఏళ్ల తర్వాత తొలిబడిలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు.. గురువులకు ఘన సన్మానం
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని వనపట్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 50 ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఐదు దశాబ్దాల క్రితం పలకా బలపం పట్టి తొలిసారిగా అక్షరాలు దిద్దిన తమ తొలిబడి ప్రాంగణంలో పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఈ సందర్భంగా అప్పట్లో పాఠశాలలో సేవలందించి పదవీ విరమణ చేసిన పలువురు ఉపాధ్యాయులు, సిబ్బందిని పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అటెండర్ మల్లయ్య, జి. బాల్‌రెడ్డి, ఎ. నారాయణరెడ్డి, గౌస్, బి. తిరుపతిరెడ్డి, జహంగీర్, రాంరెడ్డి, పర్వతాలు, చూడామణి మాతాజీ, వంకేశ్వరం నిరంజన్, యాదగిరిరెడ్డి, రంగస్వామి, శివయ్యగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, శకుంతల, రాజేశ్వర్‌రెడ్డి, చంద్రమోహన్, హెచ్ఎం ఎండీ ఖాజా, ఎం. రాములు, బి. సురేష్, జి. జ్యోతి, ఎం. మహేష్ తదితరులను సత్కరించారు.

ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల క్రితం తమ వద్ద అక్షరాలు నేర్చుకున్న చిన్నారులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడి, తమను తీర్చిదిద్దిన పాఠశాలకు తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థులంతా ఇలా కలుసుకోవడం తమకు గర్వకారణమని, ఈ ఆత్మీయ అనుబంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు.
పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు పలు హామీలు ఇచ్చారు. పూర్వ విద్యార్థి కొట్ల నిరంజన్‌రెడ్డి పాఠశాల భవనానికి రంగులు వేయిస్తానని, పుట్ట తిరుపతిరెడ్డి వంటగది నిర్మిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల అవసరాల కోసం కంప్యూటర్, ప్రింటింగ్ మిషన్‌ను పూర్వ విద్యార్థులందరి తరఫున అందజేస్తామని తెలిపారు. మరికొందరు పూర్వ విద్యార్థులు కూడా పాఠశాల భవిష్యత్ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని ప్రకటించారు.

అనంతరం కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘మన బడికి మళ్లొద్దాం’ దీర్ఘకవితను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొండకింది మన్నెపురెడ్డి, కొట్ల భాస్కర్‌రెడ్డి, వనపట్ల సుబ్బయ్య, ఎన్.రెడ్డి రాజవర్ధన్‌రెడ్డి, దొడ్ల రాజవర్ధన్‌రెడ్డి, సతీష్‌కుమార్, రజిత, యాదమ్మ, వినోద, మంజుల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



