స్టెర్లింగ్, వర్జీనియా: టాలీవుడ్ నిర్మాత నాగేశ్వర రావు పూజారితో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
డీఎంవీ ప్రాంతానికి చెందిన తెలుగు ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ప్రముఖ న్యాయవాది, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, అలాగే రాజు వెడ్స్ రాంభాయి, ఈ నగరానికి ఏమయ్యింది – పార్ట్ 2 చిత్రాల నిర్మాత నాగేశ్వర రావు పూజారి తమ జీవన ప్రయాణం, సినీ అనుభవాలు, సామాజిక బాధ్యతపై తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకున్నారు. ఆయనతో జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమం యువతను, సినీ రంగంలో ఆసక్తి ఉన్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి పరిరక్షణ, సృజనాత్మక ప్రతిభకు ప్రోత్సాహం, సమాజ ఐక్యతే ATA ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే, భారతదేశానికి – అమెరికాకు మధ్య వారధిగా పనిచేయడానికి ATA భారతదేశం నుండి వచ్చే ప్రముఖులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక నెల రోజుల పాటు విజయవంతంగా జరిగిన ఆటా వేడుకల కార్యక్రమాల్ని వివరించారు.
ఈ కార్యక్రమాన్ని ATA కాన్ఫరెన్స్ కోర్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆటా కోర్ కమిటీ సభ్యులు రవి చల్లా, జీనత్ కుందూరు, కౌశిక్ సామ, రమేష్ భీమ్ రెడ్డి, తిర్మల్ మునుకుంట్ల , వర్జీనియా వికాస్, మధు యనగంటిల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.
జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ లో అందరూ పాల్గొని సభలను విజయవంతం చేయాలని కాన్ఫరెన్స్ కమిటీ సభ్యులు రవి చల్లా కోరారు.
కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నాగేశ్వర రావు పూజారికి, కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆటా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

