ఇంటిల్లిపాదీ కలిసి సినిమా చూడాలనుకుంటున్నారా? చిన్న పిల్లలను కూడా తీసుకెళ్లాలా? సినిమాలో హింస, భయానక దృశ్యాలు లేదా ఇబ్బందికర సన్నివేశాలు ఉంటాయేమోనని సందేహిస్తున్నారా? భారతదేశంలో సినిమా సెన్సార్ సర్టిఫికెట్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా జారీ చేయబడుతుంది. ఇది సినిమా ప్రదర్శనను నియంత్రించడానికి U, U/A, A & S అనే నాలుగు రకాల రేటింగ్‌లను కేటాయిస్తుంది

అలాంటి సందేహాలకు సమాధానం సినిమా విడుదలకు ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఇచ్చే సర్టిఫికెట్‌లోనే ఉంటుంది. సినిమా కథాంశం, హింస, భాష, లైంగిక అంశాలు, భయానక దృశ్యాల తీవ్రత వంటి అంశాలను పరిశీలించి చిత్రానికి తగిన సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్‌ను బట్టి సినిమా ఎవరికి అనువైనదో ప్రేక్షకులు ముందుగానే అంచనా వేసుకోవచ్చు.

  1. ‘యూ’ (U) సర్టిఫికెట్‌

అర్థం: అందరూ చూడదగ్గ చిత్రం.

ఎవరు చూడొచ్చు?
వయోపరిమితి లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కుటుంబ సమేతంగా చూడొచ్చు.

ఎలాంటి సినిమాలకు ఇస్తారు?

  • కుటుంబ కథా చిత్రాలు
  • భక్తి చిత్రాలు
  • యానిమేషన్‌ సినిమాలు
  • హింస, అసభ్యత, బూతు సంభాషణలు తక్కువగా లేదా లేకుండా ఉండే చిత్రాలు
  1. ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్‌

అర్థం: అందరూ చూడొచ్చు. అయితే చిన్నారులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడడం మంచిది.

ఎవరు చూడొచ్చు?
12 ఏళ్లలోపు పిల్లలు పెద్దల మార్గదర్శకత్వంలో చూస్తే మంచిది.

ఎలాంటి సినిమాలకు ఇస్తారు?

యాక్షన్‌ సన్నివేశాలు కొంత ఎక్కువగా ఉండే చిత్రాలు
స్వల్ప భయానక దృశ్యాలు
పెద్దలకు మాత్రమే పూర్తిగా అర్థమయ్యే కొన్ని సంభాషణలు
నేటి చాలా కమర్షియల్‌, మాస్‌, యాక్షన్‌ సినిమాలు ఈ కేటగిరీలోనే ఉంటాయి.

  1. ‘ఏ’ (A) సర్టిఫికెట్‌

అర్థం: 18 ఏళ్లు నిండిన పెద్దలకు మాత్రమే.

ఎవరు చూడొచ్చు?
మైనర్లకు థియేటర్లలో ప్రవేశం ఉండదు.

ఎలాంటి సినిమాలకు ఇస్తారు?

  • తీవ్రమైన హింస
  • రక్తపాతం
  • భయానక దృశ్యాలు
  • శృంగారభరిత సన్నివేశాలు
  • అసభ్య పదజాలం లేదా పెద్దల కోసం రూపొందించిన కంటెంట్‌
  1. ‘ఎస్‌’ (S) సర్టిఫికెట్‌

అర్థం: సాధారణ ప్రేక్షకుల కోసం కాదు. ప్రత్యేక వృత్తుల వారికి మాత్రమే.

ఎవరు చూడొచ్చు?

  • డాక్టర్లు
  • శాస్త్రవేత్తలు
  • సైనిక సిబ్బంది
  • పరిశోధకులు
  • సంబంధిత రంగాల నిపుణులు

ఎలాంటి సినిమాలకు ఇస్తారు?
మెడికల్‌, సైంటిఫిక్‌, సాంకేతిక, పరిశోధనాత్మక చిత్రాలు లేదా డాక్యుమెంటరీలకు మాత్రమే.

సెన్సార్‌ బోర్డు ప్రధానంగా ఏమేమి పరిశీలిస్తుంది?

సినిమాకు సర్టిఫికెట్‌ ఇచ్చే ముందు సీబీఎఫ్‌సీ పలు అంశాలను పరిశీలిస్తుంది.

దేశ సమగ్రత, భద్రత, విదేశీ దేశాలతో సంబంధాలకు భంగం కలిగించే దృశ్యాలు ఉండకూడదు.
నేరాలు, ఉగ్రవాదం, హింసను ప్రోత్సహించే కంటెంట్‌కు అనుమతి ఉండదు.
ఏ మతం, కులం, వర్గం లేదా సమాజాన్ని కించపరిచే దృశ్యాలు అనుమతించరు.
మహిళలను అవమానించే, మితిమీరిన అశ్లీలత లేదా నగ్నత్వాన్ని ప్రోత్సహించే సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు.
బూతు పదాలు, ద్వంద్వార్థాల సంభాషణలు అవసరమైతే తొలగించడం లేదా మ్యూట్‌ చేయాలని సూచిస్తారు.
ధూమపానం లేదా మద్యం సేవించే దృశ్యాలు ఉంటే “ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అనే హెచ్చరిక తప్పనిసరిగా చూపించాలి.
సినిమా ప్రారంభంలో, ఇంటర్వెల్‌లో మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాలు, ధూమపానం, మద్యపానం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే సందేశాలు ప్రదర్శించాలి.
షూటింగ్‌లో జంతువులను ఉపయోగిస్తే వాటిపై ఎలాంటి హింస జరగలేదని సంబంధిత అధికారుల నుంచి పొందిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) సమర్పించాలి.

సినిమాలకు సర్టిఫికెట్‌ ఇవ్వడం అంటే కేవలం కత్తిరింపులు చేయడం మాత్రమే కాదు. ప్రేక్షకుల వయస్సు, సామాజిక బాధ్యత, చట్టపరమైన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని సినిమా ఏ వర్గానికి అనుకూలమో నిర్ణయించడం కూడా సెన్సార్‌ బోర్డు ప్రధాన బాధ్యత. అందుకే సినిమా చూడటానికి ముందు పోస్టర్‌పై లేదా టికెట్‌ బుకింగ్‌ యాప్‌లో కనిపించే U, U/A, A, S సర్టిఫికెట్‌ను ఒకసారి తప్పకుండా పరిశీలించడం మంచిది.