- పాత నిబంధనలకు స్వస్తి
- డిజిటల్ మీడియాకు తొలిసారి మార్గదర్శకాలు
హైదరాబాద్ (Breaking Now): రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025’ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 252 ను సోమవారం కె.రామకృష్ణరావు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థాయి (SMAC), జిల్లా స్థాయి (DMAC) అక్రెడిటేషన్ కమిటీల పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాతవే కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా అక్రెడిటేషన్ కార్డు, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు ఇవ్వనున్నారు. మీడియా కార్డులు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే పనికివస్తాయిని పేర్కొన్నారు. ఈ నూతన నిబంధనలు డిసెంబర్ 22, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చాయి.
కమిటీల నిర్మాణం – రెండేళ్ల కాలపరిమితి
కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థాయిలో స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ (SMAC), జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ మీడియా అక్రెడిటేషన్ కమిటీ (DMAC)లు పనిచేస్తాయి. ఈ కమిటీల పదవీకాలాన్ని రెండేళ్లుగా నిర్ణయించారు. కొత్త కమిటీలు ఏర్పడే వరకు పాత కమిటీలే కొనసాగుతాయి. రాష్ట్ర స్థాయి కమిటీలో మీడియా అకాడమీ చైర్మన్ చైర్మన్‌గా, సమాచార–పౌర సంబంధాల శాఖ కమిషనర్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జర్నలిస్టు యూనియన్ల ప్రతినిధులు, వివిధ విభాగాల (పెద్ద, మధ్య, చిన్న పత్రికలు, ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో మీడియా) ప్రతినిధులతో పాటు మహిళా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీపీఆర్వో మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు.
అక్రెడిటేషన్ రకాలు
ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తారు. డెస్క్ జర్నలిస్టులకు మాత్రం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం మాత్రమే పరిమితమైన మీడియా కార్డులు ఇస్తారు. అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటు కాలం రెండేళ్లు. కార్డు పోగొట్టుకుంటే లేదా డూప్లికేట్ కావాలంటే రూ.250 ఫీజు చెల్లించాలి.
డిజిటల్ మీడియాకు తొలిసారి స్పష్టమైన ప్రమాణాలు
డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రిడిటేషన్ విషయంలో ప్రభుత్వం తొలిసారిగా స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకొచ్చింది. నిరంతరంగా కొనసాగుతున్న వెబ్‌సైట్లు గత ఆరు నెలల్లో నెలకు కనీసం 5 లక్షల యూనిక్ విజిటర్స్ కలిగి ఉండాలి. డిజిటల్ మీడియా విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా గరిష్టంగా 10 అక్రెడిటేషన్ కార్డులు మాత్రమే జారీ చేయనున్నారు.
అర్హతలు కఠినతరం
రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్‌కు కనీసం 5 ఏళ్ల అనుభవం, జిల్లా స్థాయికి 3 ఏళ్లు, నియోజకవర్గ/మండల స్థాయికి 2 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం తప్పనిసరి.
విద్యార్హతల పరంగా రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండాలి. నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ అర్హతగా నిర్ణయించారు.
పత్రికలు, ఛానళ్లకు నిబంధనలు
దినపత్రికలు కనీసం 2,000 సర్క్యులేషన్ కలిగి ఉండి, వారానికి కనీసం 5 రోజులు ప్రచురితమవ్వాలి. పీఆర్‌జీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఎలక్ట్రానిక్ మీడియాలో శాటిలైట్ ఛానళ్లు కనీసం 50 శాతం వార్తా కంటెంట్ ప్రసారం చేయాలి. లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం మూడు 30 నిమిషాల వార్తా బులెటిన్లు ప్రసారం చేయాల్సి ఉంటుంది.
ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టులకు అవకాశం
15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, అలాగే 30 ఏళ్ల అనుభవంతో పాటు 58 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా అక్రెడిటేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు
తప్పుడు సమాచారం సమర్పించడం, అక్రిడిటేషన్ కార్డుల దుర్వినియోగం లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కార్డులను రద్దు చేయడమే కాకుండా మూడేళ్ల వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా నిషేధం విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
కొత్త నిబంధనలతో అక్రిడిటేషన్ ప్రక్రియలో స్పష్టత, క్రమశిక్షణ పెరుగుతుందని, వృత్తిపరమైన జర్నలిజానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.


