-Swamy Muddam

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు మహాసభలకు అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా మహాసభల నిర్వహణ, కార్యక్రమాల రూపకల్పన, ప్రవాస తెలుగు సమాజం భాగస్వామ్యం తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. అమెరికాలో నిర్వహించే ఈ మహాసభల్లో స్థానిక గవర్నర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

సమీకృత పాఠశాలలను ప్రవాస భారతీయుల భాగస్వామ్యంతో దత్తత తీసుకునే కార్యక్రమంలో జాతీయ సమన్వయకర్త శరత్ వేముల ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో తెలుగు మహాసభలకు హాజరైన ప్రవాస తెలుగు సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించాలని మహాసభల సమన్వయకర్త తిరుమల రెడ్డి కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, జాతీయ సమన్వయకర్త శరత్ వేముల, మహాసభల సమన్వయకర్త తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.