- బీసీల హక్కుల కోసం కొనసాగుతున్న ‘ధర్మ దీక్ష’
- చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం
- ధర్మ దీక్షకు బీసీ సంఘాల నుంచి అనూహ్య మద్దతు
మంగళగిరి: బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ (BCY) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంతో నాలుగో రోజుకు చేరుకుంది. ఏప్రిల్ 11న మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ ‘ధర్మ దీక్ష’కు రాష్ట్రవ్యాప్తంగా పలు బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు, రాజకీయ నాయకుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది.
కదులుతున్న బీసీ శ్రేణులు.. పెరుగుతున్న సంఘీభావం
దీక్ష ప్రారంభమైన తొలి రోజునే జ్యోతిరావు ఫూలే, బీపీ మండల్ వారసులు హాజరై సంఘీభావం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండో రోజు నుంచి వివిధ బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పెద్దఎత్తున దీక్షా స్థలికి చేరుకుని మద్దతు తెలుపుతున్నారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే సంఘీభావం ప్రకటించగా, వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ కూడా దీక్షా స్థలిని సందర్శించి బీసీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రంగా స్పందించారు.
ప్రభుత్వ మౌనంపై పెరుగుతున్న ఆగ్రహం
రామచంద్ర యాదవ్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తూ నిరసనలు కొనసాగిస్తున్నాయి.
“ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే పోరాటం కాదు. కోట్లాది మంది బీసీల భవిష్యత్తు కోసం చేస్తున్న ధర్మ పోరాటం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి” అని బీసీ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
రామచంద్ర యాదవ్ ప్రధాన డిమాండ్లు
బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ముందు రామచంద్ర యాదవ్ 5 ప్రధాన డిమాండ్లు ఉంచారు:
- బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు వెంటనే బీసీ రక్షణ చట్టం అమలు చేయాలి.
- రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీలకు 1,000 ఎకరాలు కేటాయించాలి.
- రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి.
- విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
- బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేస్తూ తక్షణమే నిధులు విడుదల చేయాలి.
- వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బోడె రామచంద్ర యాదవ్, తన ఆరోగ్యం కంటే బీసీల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం పై పేర్కొన్న ఐదు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చి అమలు చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏవైనా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు.
