▪️ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో ప్రదానోత్సవం
హైదరాబాద్: ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, విశ్లేషకులు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణకు ప్రతిష్ఠాత్మక ‘మహాకవి పంపన జాతీయ పురస్కారం-2026’ వరించింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘అక్షరయాన్’ విమెన్ రైటర్స్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది. మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు మార్గదర్శకత్వంలో గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి హరికృష్ణ చేసిన విశేష కృషిని గుర్తించి నిర్ణాయక కమిటీ ఈ ఎంపిక చేసింది.
భాషా ప్రేమికుడిగా, ఫ్యూజన్ షాయరీ వంటి వినూత్న ప్రక్రియ సృష్టికర్తగా, తెలంగాణ సాహిత్య చరిత్ర యుగ విభజన నిర్మాణంలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయమైనది. డాక్టర్ మామిడి హరికృష్ణ కవిగానే కాకుండా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, చిత్రకారుడిగా, సినిమా విమర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ‘తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు’ అనే అంశంపై పరిశోధన చేసిన ఆయన, గతంలో మూడుసార్లు నంది పురస్కారాలను, భారత ప్రభుత్వ ‘జాతీయ తెలుగు కవి’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన బి.సి. స్టడీ సర్కిల్ రాష్ట్ర డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 21న పంజాగుట్టలోని బి.పి.ఆర్. విఠల్ ఆడిటోరియం (CESS) లో ఉదయం 9:30 గంటలకు జరిగే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ సభలోనే మరో విశేష ఘట్టం ఆవిష్కృతం కానుంది. దాదాపు 1100 ఏళ్లుగా తెలుగులోకి అనువాదం కాని కన్నడ ఆదికవి పంపన రచించిన “విక్రమార్జున విజయం” (పంపభారతం) అనే చంపూకావ్యాన్ని జోస్యుల సదానంద శాస్త్రి తెలుగులోకి అనువదించగా, ఆ గ్రంథాన్ని ఈ వేదికపై పరిచయం చేయనున్నారు.ఈ సందర్భంగా ఇతర ప్రముఖులకు కూడా వివిధ విభాగాల్లో పురస్కారాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పంపకవి పురస్కారాలకు జోస్యుల సదానంద శాస్త్రి, హం.ప. నాగరాజయ్య, డాక్టర్ శేషశాస్త్రి, కె.ఆర్. గణేశ్, సుబ్రహ్మణ్యం కెందోళె, కందకుర్తి యాదవ రావు ఎంపికయ్యారు. అలాగే భాషాసేవ విశిష్ట పురస్కారాలను డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ, మహిపాల్ రెడ్డి, పివిజి పవన్, వసుంధరా రెడ్డి, విఠల్ జోశి, పురాణే అజయ్ కుమార్‌లకు అందజేయనున్నారు. స్ఫూర్తి పురస్కార గ్రహీతలుగా చిలుకూరి శాంత, రామ ఉమా మహేశ్వర శర్మ, గడ్డం మోహన రావులను గౌరవించనున్నారు. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహితీవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెన్నమనేని విద్యాసాగర్ రావు కోరారు.
