వరంగల్, (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్) ఫిబ్రవరి 4, 2026: వికసిత్ భారత్ అభియాన్లో భాగంగా, భారత ప్రభుత్వానికి చెందిన చట్టబద్ధ సంస్థ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ), తెలంగాణలోని జాతీయ సాంకేతిక సంస్థ, వరంగల్ (ఎన్‌ఐటీ వరంగల్) సహకారంతో “జాతీయ విద్యా విధానం–2020 ద్వారా ముందుకు సాగుదాం – సమర్థ ఉపాధ్యాయుడు, సశక్త భారత్” అనే శీర్షికతో రాష్ట్రస్థాయి కార్యశాలను బుధవారం నిర్వహించింది.

ఈ కార్యశాలలో జాతీయ ఉపాధ్యాయ వృత్తి ప్రమాణాలు (NPST), జాతీయ మార్గదర్శక మిషన్ (NMM)లను దేశవ్యాప్తంగా సమర్థంగా అమలు చేసే దిశగా భాగస్వాముల సామర్థ్యవృద్ధిపై విస్తృతంగా చర్చించారు. విద్యా రంగంలో నాణ్యత, పరిశోధన, శిక్షణ అంశాలపై నిపుణుల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఎన్‌ఐటీ వరంగల్ విద్యాశాఖాధిపతి ఆహ్వానంతో, ములుగు జిల్లా అబ్బాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర సహాయక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డా. కందాల రామయ్య ఈ కార్యశాలలో పాల్గొని చురుకైన పాత్ర పోషించారు. ఎన్‌సీటీఈ అమలు చేస్తున్న NPST, NMM కార్యక్రమాలపై ఆయన విలువైన సూచనలు, ప్రాయోగిక అభిప్రాయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా డా. కందాల రామయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయ విద్యా సంస్థలు (Teacher Education Institutions), విశ్వవిద్యాలయాలను మరింత బలోపేతం చేయాల్సిన అత్యవసరం ఉందన్నారు. అనేక చోట్ల ఉపాధ్యాయ శిక్షకుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉపాధ్యాయ విద్య నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు. ఈ ఖాళీలను పదోన్నతులు, ప్రత్యక్ష నియామకాల ద్వారా తక్షణమే భర్తీ చేయాలని సూచించారు.

అలాగే, పరిశోధనా అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు పరిశోధనా గ్రాంట్లు అందించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, పరిశోధన ఆధారిత మార్పులకు ఇది దోహదపడుతుందన్నారు. ఎన్‌సీటీఈ చేపడుతున్న NMM, NPST వంటి కార్యక్రమాలు పాఠశాల స్థాయి ఉపాధ్యాయుల వరకు చేరేలా ఎస్‌సీఈఆర్‌టీల ద్వారా, అలాగే విశ్వవిద్యాలయాలు, ఎన్‌ఐటీలు నిర్వహించే కార్యశాలలు–సదస్సుల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

డా. కందాల రామయ్య చేసిన స్పష్టమైన, ఆచరణాత్మక సూచనలను గుర్తించిన ఎన్‌సీటీఈ అధికారి డా. చాంచల్ అరోరాతో పాటు ఎన్‌ఐటీ వరంగల్ విద్యాశాఖాధిపతి శ్రీనివాస చార్య ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

కార్యశాల ముగింపులో, జాతీయ విద్యా విధానం–2020 ఆశయాలకు అనుగుణంగా సమర్థ ఉపాధ్యాయ వ్యవస్థే వికసిత్ భారత్‌కు పునాది అనే భావనతో ముందుకు సాగాలని పాల్గొన్నవారు సంకల్పం వ్యక్తం చేశారు.