ఎడిటోరియ‌ల్| ముద్దం న‌ర‌సింహ‌స్వామి

మహిళల ఆర్థిక సాధికారత మాటల్లో కాదు.. కార్యరూపంలో కనిపించాలన్న సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘లఖ్‌పతి దీదీ’ పథకానికి కొనసాగింపుగా ‘షీ మార్ట్‌’ల ఏర్పాటు ప్రతిపాదన చేసింది. ఇది కేవలం ఒక రిటైల్‌ ఆలోచన కాదు.. గ్రామీణ మహిళల జీవితాల్లో స్థిరత్వం, స్వావలంబన నింపే సామాజిక–ఆర్థిక ఉద్యమంగా చూడాల్సిన అవసరం ఉంది.

ఇన్నాళ్లు స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు-ఆహార పదార్థాలు, చేనేత దుస్తులు, హస్తకళాకృతులు-తాత్కాలిక ప్రదర్శనలు, జాతరలు, సంతల్లోనే పరిమితమయ్యాయి. సరైన మార్కెట్‌ లేక, మధ్యవర్తుల చేతుల్లో లాభాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో. ఈ లోటును భర్తీ చేయడానికే షీ-మార్ట్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. మహిళలే నిర్వహించే కమ్యూనిటీ రిటైల్ అవుట్‌లెట్లుగా ఇవి మారబోతుండటం విశేషం.

2023లో ప్రారంభమైన లఖ్‌పతి దీదీ పథకం మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఏడాదికి కనీసం లక్ష రూపాయల ఆదాయం సాధించేలా శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పించడం ద్వారా లక్షలాది మహిళలను చిన్న వ్యాపారవేత్తలుగా మార్చింది. ఇప్పటికే కోట్ల మంది మహిళలు ‘లఖ్‌పతి దీదీ’లుగా మారిన నేపథ్యంలో… వారి ఉత్పత్తులకు శాశ్వత మార్కెట్‌గా షీ-మార్ట్‌లు మారనున్నాయి.

ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే- దేశ ఆర్థిక వృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరిగితేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యం. 2050 నాటికి శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 55 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్న సూచనను ప్రభుత్వం గంభీరంగా తీసుకున్నట్టు షీ-మార్ట్‌ల ప్రతిపాదన చెబుతోంది.

షీ-మార్ట్‌ల వల్ల మహిళలకు కలిగే లాభాలు వ్యక్తిగత స్థాయిని దాటి కుటుంబం, సమాజం వరకు విస్తరిస్తాయి. నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు విక్రయించడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాల్లో పెట్టుబడిగా మారుతుంది. ఫలితంగా ఒక మహిళ ఎదుగుదల-ఒక కుటుంబ భవిష్యత్తును, చివరికి సమాజ ముఖచిత్రాన్ని మార్చే శక్తిగా మారుతుంది.

మొత్తానికి, షీ-మార్ట్‌ అనేది ప్రభుత్వ పథకం మాత్రమే కాదు.. మహిళల చేతుల్లో ఆర్థికాధికారాన్ని పెట్టే ఒక దృఢమైన సంకల్పం. దీన్ని సమర్థంగా అమలు చేయగలిగితే, భారతదేశ ఆర్థిక ప్రయాణంలో మహిళల పాత్ర మరింత బలపడటం ఖాయం.