హైదరాబాద్: సినిమా సర్టిఫికేషన్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నిబంధనలను కఠినతరం చేసింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడిందని చివరి నిమిషంలో సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేస్తే ఇకపై ప్రత్యేక మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేసింది. ఈ మేరకు నిర్మాతలు, దర్శకులు, దరఖాస్తుదారులకు బోర్డు సీఈవో రాజేంద్ర సింగ్ తాజా మార్గదర్శకాలు జారీ చేశారు.

సర్టిఫికేషన్ కోసం సమర్పించే సినిమా అన్ని విధాలా పూర్తయిన ఫైనల్ వెర్షన్ అయి ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. రఫ్ కట్స్, అసంపూర్తి చిత్రాలు, తాత్కాలిక సంగీతం, పూర్తికాని గ్రాఫిక్స్‌ను అంగీకరించబోమని తెలిపింది. ఫైనల్ సౌండ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), కలర్ గ్రేడింగ్, టైటిల్స్, క్రెడిట్స్, సబ్‌టైటిల్స్, డిస్‌క్లెయిమర్స్ తదితర పనులన్నీ పూర్తయిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వినికిడి లోపం ఉన్నవారి కోసం అవసరమైన క్లోజ్డ్ క్యాప్షన్స్, ప్రత్యేక సబ్‌టైటిల్స్, దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆడియో డిస్క్రిప్షన్ వంటి సౌకర్యాలను కూడా ఫైనల్ వెర్షన్‌లో చేర్చాలని పేర్కొంది.

ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించామని, ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని చెప్పినా సర్టిఫికేషన్ ప్రక్రియలో ఎలాంటి ప్రత్యేక వెసులుబాటు కల్పించబోమని తేల్చిచెప్పింది. ట్రైలర్లు, టీజర్లు, ప్రీమియర్ షోల తేదీలను చూపించి ప్రక్రియను వేగవంతం చేయాలని ఒత్తిడి చేయడం కుదరదని స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలు, ఇతర ఫార్మాలిటీలు పూర్తికాకపోతే దరఖాస్తులను తిరస్కరించడం లేదా వెనక్కి పంపించడం జరుగుతుందని హెచ్చరించింది.

సినిమా టైటిల్ విషయంలోనూ బోర్డు కీలక స్పష్టతనిచ్చింది. దరఖాస్తులో పేర్కొన్న టైటిల్‌తో పాటు ట్రైలర్లు, టీజర్లు, ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించే పేర్లకు కూడా ముందస్తు ఆమోదం లభించినట్లు భావించకూడదని తెలిపింది. మార్గదర్శకాలకు అనుగుణంగా ఎగ్జామినింగ్ కమిటీ లేదా రివైజింగ్ కమిటీ టైటిల్‌ను పరిశీలించి అవసరమైతే మార్పులు సూచించే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ నిబంధనలతో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. సాధారణంగా విడుదలకు కొద్దిరోజుల ముందు వరకు వీఎఫ్ఎక్స్, కలర్ గ్రేడింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుంటాయి. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ పనులన్నీ ముందుగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోవైపు సెన్సార్ ప్రక్రియలో జాప్యం కారణంగా చివరి నిమిషంలో థియేటర్లలో షోలు రద్దయ్యే పరిస్థితులను నివారించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. సినిమాటోగ్రఫీ చట్టం–1952, సినిమాటోగ్రఫీ రూల్స్–2024 నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, సినిమా విడుదలకు తగినంత ముందుగానే సర్టిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సీబీఎఫ్‌సీ సూచించింది.