దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో దుబాయ్ ఆకాశహర్మ్యాలు, ప్రముఖ కట్టడాలను ప్రతిబింబించేలా దుర్గమ్మ మండపాన్ని ఏర్పాటు చేశారు. అస్సాంలోని ధుబరీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి 50 వేల పిన్నులతో అమ్మవారి రూపాన్ని రూపొందించారు. మరోవైపు, కోల్కతాలోని దుర్గా మండపాలు సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాయి. హరిదేవ్పుర్లో ‘ద్వైత్య’ ఇతివృత్తంతో రూపొందించిన మండపం ట్రాన్స్జెండర్ల హక్కులు, సమాజంలో వారికి దక్కాల్సిన గుర్తింపును చాటుతోంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ ఏర్పాటు చేసిన మరో మండపం అన్యాయంపై మౌనం వీడి, న్యాయం కోసం పోరాడాలని ప్రజలకు సందేశమిస్తోంది. భక్తి, సామాజిక చైతన్యాన్ని పెంపొందించే వేదికలుగా దుర్గమ్మ మండపాలు నిలుస్తున్నాయి.