▪️ బాల్టిమోర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు వేడుకలు
▪️ మేరిల్యాండ్ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయి తెలుగు మహాసభ
మేరిల్యాండ్: అమెరికాలో తెలుగు భాషా–సంస్కృతుల పరిరక్షణకు పనిచేస్తున్న ప్రముఖ తెలుగు సంఘం ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA)’ ప్రతినిధులు మేరిల్యాండ్ రాష్ట్ర గవర్నర్ వెస్ మూర్, లెఫ్టినెంట్ గవర్నర్ అరుణ మిల్లర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, బాల్టిమోర్‌లో నిర్వహించనున్న ‘ఆటా’ 19వ మహాసభలకు అధికారిక ఆహ్వానం అందజేశారు. మేరిల్యాండ్ రాష్ట్ర క్యాపిటల్‌లో జరిగిన ఈ సమావేశానికి ATA అధ్యక్షుడు జయంత్ చల్లా నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాలా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు రామ్ మట్టపల్లి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్ కూడా ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు.

జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో 3 రోజుల పాటు జరిగే ATA 19వ మహాసభల ఏర్పాట్ల గురించి ATA ప్రతినిధులు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్‌కు వివరించారు. మేరిల్యాండ్ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న జాతీయ స్థాయి తెలుగు మహాసభగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఈ మహాసభలకు సుమారు 15 వేల మంది పాల్గొనే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా గవర్నర్ వెస్ మూర్, లెఫ్టినెంట్ గవర్నర్ అరుణ మిల్లర్ ATA ప్రతినిధులను అభినందిస్తూ, మహాసభలు విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వీలైనంతవరకు తాము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు శాఖల కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఈ మహాసభల్లో పాల్గొనే అవకాశముందని సమాచారం.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఒక జాతీయ స్థాయి లాభాపేక్షలేని సంస్థ. అమెరికా వ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తోంది.
