హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సాహిత్య వారం కార్యక్రమంలో భాగంగా రవీంద్రభారతిలో ‘క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వె’ పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. ఎన్. బాలాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మరాఠీ నుంచి తెలుగులోకి గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ అనువదించిన ఈ గ్రంథాన్ని అకాడమీ ప్రచురించింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న రచయిత కృపాకర్ పొనుగోటి మాట్లాడుతూ లహుజీ సాళ్వె బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా, సమాజోద్ధరణ కోసం అనేక మహనీయులను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. బాలికల విద్యా ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తొలి మహిళా ఉపాధ్యాయులైన సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా షేఖ్‌లకు ఆయన బలమైన అండగా నిలిచారని తెలిపారు.

విశిష్ట అతిథులుగా పాల్గొన్న డా. పసునూరి రవీందర్, ప్రొఫెసర్ వాగేషన్ మాట్లాడుతూ లహుజీ సాళ్వె జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలని, ఈ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనువాద రచయిత గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ మాట్లాడుతూ ఈ గ్రంథాన్ని తెలుగులో ప్రచురించిన తెలంగాణ ప్రభుత్వానికి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. ఎన్. బాలాచారి, మారాఠీ రచయిత చంద్రకాంత్ వాన్ ఖేడే, ప్రొఫెసర్ సి. కాశీమ్, బి.ఎస్. రాములు, వాహద్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పి. కృష్ణయ్య (ఏరుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు), నవీన్ రాజు (యువసేన అధ్యక్షుడు), తెలంగాణ సచివాలయ అధికారులు, డా. విశ్వకర్మ, అమృత్ కళ్యాణ్, కాంబ్లే శంకర్ మాంగ్, కె. సుధాకర్ మాంగ్, ఎన్. రమాకాంత్ మాంగ్ తదితరులు పాల్గొన్నారు.


