Breaking Now Network:

ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నాలుగు దశాబ్దాలకు పైగా విద్యాసేవ చేసిన కంటింజెంట్ స్వీపర్ మల్రాజు సమ్ములు–సోమలక్ష్మి దంపతుల పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ఆవరణంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు, సీఆర్‌పీలు, గ్రామస్తుల సమక్షంలో ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

జంగాలపల్లి పాఠశాలలోనే చదువుకుని అదే పాఠశాలలో స్వీపర్‌గా 41 సంవత్సరాలు 5 నెలలు నిరంతరం సేవలందించిన సమ్ములు నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన సేవలు పాఠశాల పరిశుభ్రతకు మాత్రమే పరిమితం కాకుండా, పేద విద్యార్థుల అభ్యున్నతికి కూడా దోహదపడ్డాయని ఉపాధ్యాయులు గుర్తుచేశారు.

సమ్ములు ఉద్యోగంలో చేరిన సమయంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన కీర్తిశేషులు దొడ్డ నర్సిరెడ్డి మార్గదర్శకత్వం ఆయనలో క్రమశిక్షణా విలువలను పెంపొందించిందని కార్యక్రమంలో ప్రస్తావించారు. అనంతరం ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధినేత దొడ్డ ప్రతాపరెడ్డి స్వయంగా స్వంత నిధులతో కార్యక్రమాన్ని నిర్వహించి, రూ.25,000 నగదు అందించి సమ్ములు దంపతులను సన్మానించారు. అలాగే గ్రామపంచాయతీ కార్మికునిగా వారికి సేవ చేసే అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం వివిధ ప్రయోజనాలు లభిస్తుంటే, కంటింజెంట్ స్వీపర్‌గా పనిచేసిన సమ్ములకు ఎలాంటి ప్రయోజనాలు లభించకపోవడం బాధాకరమని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు మానవతా దృక్పథంతో రూ.10,000 ఆర్థిక సహాయం అందించి ఆయనకు సంఘీభావం వ్యక్తం చేశారు.

సమ్ములు సేవలను గుర్తుచేసుకుంటూ మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి సేవాభావం కలిగిన వ్యక్తి మనకు దొరకడం అదృష్టమని, ఆయనను ఎప్పటికీ మర్చిపోలేమని కన్నీటి వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా సమ్ములు మాట్లాడుతూ, “ఈ పాఠశాలలో 41 ఏళ్లకు పైగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ చదివిన విద్యార్థులు డీఎస్పీలు, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా ఎదిగి నన్ను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు. భవిష్యత్తులో చదివే విద్యార్థులు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత స్థాయికి ఎదగాలి” అని ఆకాంక్షించారు. పాఠశాల సేవల నుండి విడిపోవడం తనకు బాధాకరమని భావోద్వేగంతో తెలిపారు.