Breaking Now App Network
రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రైతులు క్రాప్ డైవర్షన్ వైపు మళ్లాలని, లేదంటే భవిష్యత్తులో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నర్మేట వద్ద నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణకు సిద్దిపేట కేంద్రంగా ఉండటంతో ఇక్కడే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. అదేవిధంగా రూ.40 కోట్లతో రిఫైనరీ ఆయిల్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ఆయిల్ పామ్ వ్యర్థ గెలలతో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నామని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్న నేపథ్యంలో రైతులు హార్టికల్చర్ పంటల వైపు మళ్లాలని సూచించారు. తాను కూడా తన సొంత పొలంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నానని మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లాలో బాలకృష్ణ అనే దళిత రైతు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారని ఆయన చెప్పారు.
రైతులు ఆయిల్ పామ్ సాగు చేయడానికి అవసరమైన అన్ని సబ్సిడీలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తాను మంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు టన్నుకు రూ.12 వేలుగా ఉన్న ధరను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రస్తుతం రూ.21 వేల వరకు పెంచామని చెప్పారు. ఆయిల్ పామ్ సాగులో ఇంటర్ క్రాప్ పంటలకు కూడా సబ్సిడీ ఇస్తామని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో 30 జిల్లాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కొనసాగుతోందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేయగల పంటల్లో ఆయిల్ పామ్ ఒకటని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతులను ఇక్కడికి పిలిచి వారికి అవసరమైన స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ: మంత్రి పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇటీవల గుజరాత్ వెళ్లినప్పుడు అక్కడ గ్రామీణ స్థాయి నుంచి పాల సేకరణ జరిగి అమూల్ పాలు దేశవ్యాప్తంగా విస్తరించిన విధానం చూసామని చెప్పారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఆయిల్ పామ్ ఉత్పత్తిని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. గతంలో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్తి చేయించారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ పంట పండదనే అపోహను మంత్రి తుమ్మల తొలగించారని, ప్రస్తుతం రైతులు ఈ పంటపై ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేయడం మంచిదని ఈ ప్రాంత రైతులను కోరుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

