▪️ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన అధ్య‌క్షునిగా బత్తుల ప్రసాద్
▪️ గౌరవ అధ్యక్షులుగా జర్నలిస్ట్ ప్రభు
▪️ ఉపాధ్యక్షులుగా ఈ. జనార్దన్ రెడ్డి, ఎం.డి. అబ్దుల్
▪️ ప్రధాన కార్యదర్శిగా సురేష్ కొండేటి
▪️ సంయుక్త కార్యదర్శులుగా పర్వీన్, భాగవతుల మురళి
▪️ కోశాధికారిగా చదలవాడ భరద్వాజ్

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల కోసం సర్వసభ్య సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా నిర్వహించబడింది. సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణ్ రావు, గొటేటి మోహన్ తదితరుల సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటోగ్రాఫర్ ఈ. జనార్దన్ రెడ్డి, మరో ఉపాధ్యక్షుడిగా ఎం.డి. అబ్దుల్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సురేష్ కొండేటి బాధ్యతలు స్వీకరించగా, సంయుక్త కార్యదర్శులుగా పర్వీన్, భాగవతుల మురళి, కోశాధికారిగా చదలవాడ భరద్వాజ్ ఎన్నికయ్యారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా గిరిధర్, నరసింహ, సాయిరమేష్, ఆర్‌డీఎస్ ప్రకాష్, నవీన్, గోరంట్ల రవి, అప్పాజీ శ్యామ్, చందు రమేష్, టి. కేశవాచారి తదితరులు ఎన్నుకోబడ్డారు.

ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ 1969లో స్థాపించబడిన ఈ అసోసియేషన్‌కు గొప్ప చరిత్ర ఉందన్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థ సభ్యుల స్వంత ఇంటి కలను సాకారం చేయడానికి ముందుకు వచ్చిన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ రావుకు అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కొందరు క్రిటిక్స్‌ను అణగదొక్కాలని చేసిన ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. తన స్వర్గస్తురాలైన భార్య ఆడెపు దుర్గా మాధవి జ్ఞాపకార్థం రూ.50 వేల విరాళాన్ని క్రిటిక్స్‌కు అందజేస్తున్నట్లు ప్రకటించారు.

అధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ తాను మహానగర్ ఈవినింగ్ ఎడిషన్‌లో రూ.500 జీతంతో సినిమా జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో ప్రముఖ పి.ఆర్.ఓ గిరిధర్ గారు అసిస్టెంట్ పి.ఆర్.ఓగా మరో రూ.500 వేతనం ఇచ్చారని తెలిపారు. ఆ రోజుల్లోనే గిరిధర్ గారు తనను చదలవాడ శ్రీనివాసరావుకు పరిచయం చేశారని, ఈ రోజు ఆయన కుటుంబ సభ్యుడిగా మారానని భావోద్వేగంతో చెప్పారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులందరినీ చదలవాడ శ్రీనివాసరావు తమ ఇంటి పెద్ద కొడుకులుగా భావిస్తున్నారని తెలిపారు. సభ్యుల స్వంత ఇంటి కలను నిజం చేయడానికి సుమారు రూ.300 కోట్ల ఆస్తిని కేటాయించేందుకు ముందుకు రావడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కార్యదర్శిగా పనిచేసిన తాను, ఇప్పుడు అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ తాను కృష్ణా పత్రికలో పనిచేస్తున్న రోజుల నుంచే ఈ అసోసియేషన్ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. సీనియర్లు రాసిన వ్యాసాల కటింగ్స్ సేకరించేవాడినని తెలిపారు. వార్తలో ఉద్యోగం వచ్చిన తరువాత బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో అసోసియేషన్ సభ్యుడిగా చేరానని చెప్పారు. గతంలో రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలందించిన తాను, ఇప్పుడు కార్యదర్శిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. కరోనా సమయంలో అసోసియేషన్ తరఫున నిధుల సేకరణ చేసి సభ్యులకు ఆర్థిక సహాయం అందించామని గుర్తుచేశారు. ఇకముందు కూడా ఫండ్ రైజింగ్‌కు కృషి చేస్తానని చెప్పారు. సభ్యులకు స్వంత నిధులతో ఇల్లు కల్పించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

సీనియర్ సభ్యుడు బాలిరెడ్డి మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన సభ్యుల స్వంత ఇంటి కలను సాకారం చేయడానికి ముందుకు వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు పెద్ద మనసుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నానన్నారు. ఈ రోజు అసోసియేషన్ కళకళలాడటానికి ఆయన చొరవే ప్రధాన కారణమని తెలిపారు.

ఇంకా ఈ సమావేశంలో సీనియర్ సభ్యులు లక్ష్మణరావు, మామిడి గిరిధర్, సాయిరమేష్, భాగవతుల మురళి తదితరులు ప్రసంగించారు. చివరగా ఎం.డి. అబ్దుల్ వందన సమర్పణతో సమావేశం ముగిసింది.